- సౌకర్యాల గురించి పట్టించుకోని కాంట్రాక్టర్లు
- అవస్థలు పడుతున్న కార్మికులు
ప్రజాశక్తి-విజయవాడ: కూలి, కనీస సౌకర్యాల విషయమై కార్మికులు ఆందోళన చేపట్టినా కాంట్రాక్టర్ల తీరు మారలేదు. కార్మికులు ఎదుర్కొంటున్న శ్రమ దోపిడీ, వారి ఇబ్బందులను పరిష్కరించాలని సోమవారం రాత్రి బాధిత కార్మికులతో సిఐటియు నాయకులు విఎంసి ప్రధాన కార్యాలయం వద్ద చేసిన ఆందోళన సందర్భంగా భోజన సదుపాయంతో పాటు ఇతర వసతి కల్పించేటట్లు సదరు కాంట్రాక్టర్లతో మాట్లాడతామని నగరపాలకసంస్థ ప్రజారోగ్య విభాగం ఉన్నతాధికారి హామీనిచ్చారు. ఈ హామీని మరుసటి రోజు మంగళవారం నాటికే కాంట్రాక్టర్లు పూర్తిగా విస్మరించడంతో కార్మికులకు అవస్థలు తప్పడంలేదు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో నిర్మాణం ఆగిపోయిన కొత్త బిల్డింగ్‌లో కార్మికులను కుక్కారు. ఎటువంటి వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జి+3 నిర్మాణమైన బిల్డింగ్ నాలుగువైపుల ఎటువంటి గోడ లేకపోవడంతో సోమవారం రాత్రి వీచిన బలమైన గాలికి బిల్డింగ్‌లో పేరుకుపోయిన దుమ్ము, దూళి, సిమెంట్ కార్మికులపై పడటంతో నిద్రపోలేని పరిస్థితి నెలకొంది. ఈ బాధలు తట్టుకోలేక తమతో వచ్చిన అనేక మంది ఇళ్లకు వెళ్లారని, గ్రామాల్లో కూడా పనులు లేక, చేతిలో చిల్లిగవ్వ కూడా లేక, కుటుంబాలు గడవటం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో చేసేది లేక ఇక్కడకు వస్తే అడుగడుగునా ఇబ్బందులు పడక తప్పడం లేదని పలువురు మహిళా కార్మికులు వాపోయారు. సోమవారం రాత్రి చేసిన ఆందోళన కారణంగా కంటితుడుపుగా ఉదయం పూట కొద్ది మందికి భోజనం పెట్టినట్లు పెట్టి, మిగిలిన వారికి తమకు సంబంధం లేదని వదిలేయడంతో చేసేది లేక వినాయకుడి గుడి ఏరియాల్లో సత్రం వద్ద భోజనం కోసం వెళ్తే అక్కడా కూడా అయిపోయి అర్ధాకలితోనే పనిలోకి వెళ్లాల్సి వచ్చిందని బాపట్ల జిల్లాకు చెందిన మహిళా కార్మికురాలు తెలిపింది. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారుల అండ పుష్కలంగా ఉండబట్టే కార్మికులను కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.










