అనంతపురంసిటీ : టీచర్ల బదిలీల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరక్కుండా అందరికీ సమన్యాయం చేయాలని ఆర్జేడీ, ఇన్‌ఛార్జి డీఈవో ఎం.వెంకటక్రిష్ణారెడ్డి డీవైఈవోలు, ఎంఈవోలను ఆదేశించారు. మంగళవారం నగరంలోని జిల్లా సైన్స్ సెంటర్లో టీచర్ల బదిలీలపై ఉమ్మడి అనంతపురం జిల్లా డీవైఈవోలు, ఎంఈవోలు, ఎంఐఎస్, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాజాగా టీచర్ల బదిలీల షెడ్యూల్ వచ్చిందన్నారు. జీరో సర్వీస్, ఐదేళ్లు, ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ బదిలీలకు అర్హులన్నారు. బదిలీలకు దరఖాస్తు చేసుకున్న ప్రతిదరఖాస్తున్ని క్షుణంగా పరిశీలించాలన్నారు. ప్రైమరీ, యుపి, హైస్కూల్ యూడైస్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకోవాలన్నారు. ఎల్‌పిటి, పిఈటీ, ఫిజికల్ సైన్స్ టీచర్లు ఎక్కడ పనిచేస్తున్నారో వారి వివరాలు ఖచ్ఛితంగా ఉండాలన్నారు. సాయంత్రంలోపు ఖాళీల వివరాలను పక్కాగా అందజేస్తే వాటిని తాము బుధవారం కమిషనర్ వద్దకు తీసుకెళ్తామన్నారు. మెడికల్, స్పౌజ్ సర్టిఫికెట్లను కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకోవాలన్నారు. బదిలీల్లో ఏమైనా సందేహాలుంటే తమ దష్టికి తీసుకురావాలన్నారు. డీవైఈవోలు, ఎంఈవోలు అనంతపురం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఉద్యోగులతో సమన్వయం చేసుకుని బదిలీ ప్రక్రియను ప్రశాంతంగా, పారద్శకంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ డీవైఈవో రంగస్వామి, ధర్మవరం డీవైఈవో మీనాక్షి, అనంతపురం డీవైఈవో పద్మప్రియ, గుత్తి డీవైఈవో శంకర ప్రసాద్, అనంతపురం డీఈవో ఆఫీస్ ఏడీ క్రిష్ణయ్య, శ్రీ సత్యసాయి జిల్లా డీఈవో ఆఫీస్ ఏడీ నాగరాజు, సూపరింటెండెంట్లు శ్రీనాథ్, ఆదినారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.










