ప్రజాశక్తి మడకశిర : ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తే సత్ఫలితాలు వస్తాయని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఇది గుర్తించాలని ఐక్య ఉపాధ్యాయ సంఘం (యుటిఎఫ్‌్) జిల్లా అధ్యక్షులు జయచంద్రా రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యటనల పేరుతో ఉపాధ్యాయుల ఆత్మస్థైర్యంకోల్పోయేలా వ్యవహరిస్తే కచ్చితంగా ప్రవీణ్ ప్రకాశ్ పర్యటనలను అడ్డుకోవాలని, బహిష్కరించాలని పిలుపునిస్తామని స్పష్టం చేశారు. మంగళవారం మడకశిరలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకలైన ఉపాధ్యాయులు రోడ్డెక్కకుండా చేయడానికే ప్రభుత్వం ప్రవీణ్ ప్రకాశ్‌ను పాఠశాల విద్యాశాఖకు తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. విద్యారంగం బలోపేతానికి, సంస్కరణల అమలుకు విశాఖ సదస్సులో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించాలని డిమాండ్ చేసారు. అదేవిధంగా ఎంఎల్‌సి ఎన్నికల రోజును సెలవు దినంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించారని గుర్తు చేసారు. దీనిని అనుసరించి జిల్లా అధికారులు కూడా అదే రోజును ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యా సంస్థలకు సెలవు దినంగా ప్రకటించాలని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కోశాధికారి సుధాకర్, గౌరవాధ్యక్షులు భూతన్న, జిల్లా కార్యదర్శులు నారాయణ స్వామి, హరికృష్ణ, మండల నాయకులు మహాలింగప్ప, నరసింహప్ప, ముడ్లగిరియప్ప, జోగప్ప, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.










