Mar 12,2023 21:29

టీి-20 క్రికెట్‌ టోర్నీ విజేతగా నిలిచిన అనంతపురం జట్టు

 కడప : జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా కడప వైయస్‌ రాజారెడ్డి ఎసిఎ స్టేడియంలో నిర్వహించిన పి. ధనుంజరు రెడ్డి మెమోరియల్‌ వెటరన్స్‌ టి-20 క్రికెట్‌ టోర్నీ విజేతగా అనంతపుం జట్టు నిలిచింది. రన్నర్స్‌గా హైదరాబాదు జట్టు నిలిచింది. ఆదివారం ఉదయం నిర్వహించిన ఫైనల్స్‌ మ్యాచ్‌లో అనంతపురం, హైదరాబాద్‌ జట్లు తలపడ్డాయి. 10 పరుగుల తేడాతో హైదరాబాద్‌ జట్టుపై అనంతపురం జట్టు విజయం సాధించి టోర్నీ విజేతగా నిలిచింది. టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అనంతపురం జట్టు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆ జట్టులోని ప్రదీప్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ లో రాణించాడు. 63 బంతులను ఎదుర్కొని 16 బౌండరీలు సహాయంతో సెంచరీ ( 100 పరుగులు) చేసి నాటౌట్‌ గా నిలిచారు. మరో బ్యాట్స్‌మెన్‌ సయ్యద్‌ షహబుద్దీన్‌ 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. హైదరాబాదు జట్టులోని చంద్రశేఖర్‌ తోట ఒక వికెట్‌ తీసుకున్నాడు. అనంతరం 207 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసి ఆల్‌ అవుట్‌ అయి ఓటమి చవిచూసింది. ఆ జట్టులోని టి. చంద్రశేఖర్‌ 74, శ్రీధర్‌ శర్మ 47 పరుగులు చేశారు. అనంతపూర్‌ జట్టులోని ఇనాయతుల్లా 2 వికెట్లు తీసుకున్నాడు.
విజేతగా నిలిచిన అనంతపూర్‌ గట్టుకు విన్నర్స్‌ కప్పును, రనర్స్‌గా నిలిచిన హైదరాబాద్‌ జట్టుకు కప్పును జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎం. భరత్‌ రెడ్డి, కార్యదర్శి ఎ. రెడ్డి ప్రసాద్‌, ఎసిఎ సౌత్‌ జోన్‌ కన్వీనర్‌ పి. సంజరు కుమార్‌ రెడ్డి అందజేశారు. టోర్నమెంట్‌లో బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌గా, బౌలర్లుగా ప్రతిభ కనబరిచిన వారికి మెమొంటోలు అందజేశారు. కార్యక్రమంలో ఎసిఎస్‌ అవుట్‌ జోన్‌ అకాడమీ పరిపాలన అధికారి ఏ. శ్రీనివాసులు, జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యులు ముని కుమార్‌ రెడ్డి, రెహమాన్‌, విష్ణు మోహన్‌ రావు, కరుణాకర్‌ రెడ్డి, మహేంద్ర రెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి, అశ్విని కుమార్‌ రాజు, శివ ప్రసాదు, ఇరుజట్ల క్రీడాకారులు పాల్గొన్నారు.