టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలి
ప్రజాశక్తి-కావలి : జిల్లా వ్యాప్తంగా నిర్మాణాలు పూర్తయిన 'టిడ్కో' ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, నెల్లూరు మున్సిపల్ మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బుధవారం కావలి మున్సిపాలిటీ పరిధిలోని టిడ్కొ ఇళ్లను స్థానిక సిపిఎం నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు సిపిఎం నాయకులు పట్టణంలోని ''జర్నలిస్ట్ క్లబ్''లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు కేటాయించని ఇళ్లకు వాయిదాలు కట్టాలని బ్యాంకుల నుండి లబ్ధిదారులకు నోటీసులు అందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాపలాదారులు లేక ఇళ్ల తలుపులు, ద్వారబంద్రాలు దొంగలు ఎత్తుకెళ్తున్నారని తెలిపారు. వాటిని వెంటనే లబ్ధిదారులకు కేటాయించి వారికి నివాసం కల్పించాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించకపోతే, వారికి అండగా సిపిఎం తరుపున నిలబడి ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 2200 ఇళ్లు నిర్మాణాలు పూర్తి చేసుకొని కూడా నిరుపయోగంగా పడి ఉన్నాయని తెలిపారు. 2017 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం లబ్ధిదారుల నుండి రూ.12,500, రూ.25,000, రూ.50,000, రూ1,00,000 వంతున వసూలు చేసి ఉన్నారన్నారు. అప్పటినుండి ఇప్పటి వరకు లబ్దిదారులకు ఇళ్లను కేటాయించలేదన్నారు. పేదలు తాము దాచుకున్న సొమ్మును, అప్పులు చేసి కట్టినా, ఇప్పటికీ వారికి ఇళ్లు కేటాయించలేదన్నారు. ఇల్లు కేటాయించకపోయినా బ్యాంకు అధికారులు మాత్రం ఒక్కరికీ రూ.9000 చొప్పున కట్టాలని నోటీసులు పంపుతూ లబ్ధిదారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. లబ్ధిదారులకు వెంటనే ఇళ్లను కేటాయించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి వై.కృష్ణమోహన్, సిపిఎం నాయకులు పెంచలనరసింహం, బోగిశెట్టి వెంకటేశ్వర్లు, కిష్టయ్య, చెన్నయ్య, బాబురావు, కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.










