Apr 21,2023 18:56

మున్సిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందజేస్తున్న బత్యాల

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ : టిడ్కో ఇళ్ల నిర్మాణాలు చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే బత్యాల చెంగల్రాయుడు అన్నారు. శుక్రవారం ఇళ్ల నిర్మాణాలపై మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.జనార్దన్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి హయాంలో పేద, మధ్య తరగతి వారికి తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ఇళ్లు నిర్మించాలన్న సంకల్పంతో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి పూనుకున్నదని పేర్కొన్నారు. మండలంలోని బోయినపల్లి వద్ద 845 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని తెలిపారు. వైసిపి అధికారంలోకి వచ్చాక టిడిపి సంకల్పాన్ని పూర్తిగా నీరుగార్చేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. వెంటనే ఇళ్ల నిర్మాణాలు చేపట్టి లబ్దిదారులకు అందజేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ పేదరిక నిర్మూలనే టిడిపి ధ్యేయమని తెలిపారు.ఎన్టీఆర్‌ నాయకత్వంలో పేదల సంక్షేమానికి, అన్ని వర్గాలకు సమాన అవకాశాలను కల్పించడమే కాకుండా పాలనా వికేంద్రీకరణకు నాంది పలికారని పేర్కొన్నారు. తెలుగుజాతి సమగ్రాభివద్ధికి సంకేతంగా చంద్రబాబు నాయుడు పార్టీ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు డాక్టర్‌ సుధాకర్‌, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షులు గన్నేసుబ్బ నరసయ్య నాయుడు, మహిళా నాయకురాలు అనసూయమ్మ, గుగ్గిళ్ల చంద్రమౌళి, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు రేవూరి వేణుగోపాల్‌, జడ శివ పాల్గొన్నారు.