మహిళా ద్రోహి సిఎం జగన్
అధికారంలోకొస్తే మహిళలకు ఉద్యోగ అవకాశాలు
- టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
ప్రజాశక్తి-వాల్మీకిపురం : తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళం పేరుతో లోకేష్ చేపట్టిన పాదయాత్ర 38వ రోజుకు చేరుకుంది. బుధవారం పీలేరు నియోజకవర్గంలోని చింతపర్తి బోయపల్లి క్రాస్ నుంచి నుంచి ప్రారంభమైన పాదయాత్ర విటలం, పునుగుపల్లి, వాల్మీకిపురం, ఆర్‌టిసి బస్టాండ్, మదనపల్లె మండలంలోని పూలవాండ్లపల్లి వరకూ పాదయాత్ర సాగింది. పూలవాండ్లపల్లి వద్ద విడిది కేంద్రంలో బస చేశారు. 13.9 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర సందర్భంగా ఆయా ప్రాంతాల్లో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలతో ముఖాముఖి, మైనార్టీలు, స్థానికులతో మాటామంతి కార్యక్రమాలు నిర్వహించారు. చింతపల్లి విడిది కేంద్రం వద్ద లోకేష్‌ను ఫిజియోథెరపి అసోసియేషన్ నాయకులు కలిసి తమ సమస్యలు వివరించారు. మాజీ మంత్రి దేవినేని ఉమా పాదయాత్రలో పాల్గొని లోకేష్‌కు సంఘీభావం తెలిపారు. పాదయాత్ర సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ చట్టాల ద్వారా మాత్రమే మహిళలకు రక్షణ రాదని, చిన్న వయస్సు నుండే మగ వాళ్లకు మహిళల గౌరవం తెలిసేలా ప్రత్యేక పాఠ్యాంశాలు ఉండాలన్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే కేజీ నుండి పీజీ వరకూ మహిళల గొప్పతనం, వారు పడే కష్టాలు తెలిసేలా ప్రత్యేక పాఠ్యాంశాలు పెడతామన్నారు. జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదని, కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 52 వేల మంది మహిళలపై వేధింపులు జరిగాయని వివరించారు. విద్యా రంగంలో ఇంకా మహిళలు వెనకబడి ఉన్నారని, ఎక్కువ మంది మహిళలు చదువుకోవడానికి, డ్రాప్ అవుట్స్ లేకుండా చేయడానికి టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేస్తామన్నారు. ప్రత్యేక కళాశాలలు, ఉన్నత విద్యకు సహాయం, విదేశీ విద్యకు సహాయం అందిస్తామన్నారు. వైసిపి ప్రభుత్వంలో భద్రత విషయంలో కానీ, జీతాల విషయంలో కానీ మహిళలకు సమాన హక్కులు లేవని, సమాన వేతనం కోసం టిడిపి హయాంలో అనేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అనేక పరిశ్రమలు తీసుకొచ్చిన్నప్పుడు మహిళలకు ప్రత్యేకంగా ఉద్యోగాలు కల్పించడంతో పాటు మంచి జీతాలు ఇవ్వాలని మేము కంపెనీలను కోరేవాళ్ళం, మళ్లీ టిడిపి అధికారంలోకి రాగానే అన్నింటినీ పరిశీలించి తప్పక పరిష్కరిస్తామన్నారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న సంఘమిత్రలను వైసిపి ప్రభుత్వం తొలగించిందని, ఎన్నికల ముందు కులం, మతం చూడమని, ఇప్పుడు ఉపాధి హామీలో ఫీల్డ్ అసిస్టెంట్ల దగ్గర నుండి సంఘమిత్రల వరకూ అడ్డగోలుగా తొలగిస్తున్నారన్నారు. ఆఖరికి డ్వాక్రా మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు కూడా జగన్ ప్రభుత్వం కొట్టేసిందన్నారు. చంద్రబాబు సిఎం కాగానే సంఘ మిత్రలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి పట్టాకు వన్ టైం సెటిల్మెంట్‌లో రూ.10 వేలు కట్టించుకోవడం దారుణమన్నారు. వన్ టైం సెటిల్మెంట్ ఒక పెద్ద మోసమని, రూ.10 వేలు కట్టించుకొని ఇచ్చిన ధ్రువ పత్రం తీసుకొని రుణం కోసం బ్యాంక్‌కు వెళ్తే బయటకి పొమ్మని తిడుతుండడం బాధాకరమన్నారు. మహిళలని మోసం చేసింది సిఎం జగన్ అని, దిశ చట్టం లేకుండానే జగన్ హడావిడి చేశారని, 900 మంది మహిళలపై అత్యాచారాలు జరిగితే 21 రోజుల్లో ఒక్కరికీ న్యాయం జరగలేదన్నారు. సంపూర్ణ మద్యపానం నిషేదం తర్వాత ఓట్లు అడుగుతానని, ఇప్పుడు ఏకంగా జే బ్రాండ్ లిక్కర్ తయారు చేసి అమ్ముతున్నారని, తాగుబోతులను తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చాడన్నారు. టిడిపి హయాంలో ఇలాంటివి ప్రోత్సాహంచే ప్రసక్తేలేదన్నారు. వైసిపి కేసులకు బయపడొద్దని, అక్రమ కేసులు పెట్టిన అధికారులపై టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యూడిషియల్ ఎంక్వైరీ వేసి, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ విద్య పథకాన్ని అమలు చేస్తామని, గతంలో నేరుగా కళాశాలలకే ఫీజురీయింబర్స్‌మెంట్ చేసే వాళ్ళమని, జగన్ ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఆపేసి విద్యా దీవెన, వసతి దీవెన పెట్టి మోసం చేస్తున్నారన్నారు. ప్రతి ఏడాది రూ.32 వేల నుండి రూ.38 వేల ఫీజు ఉంటే తల్లి ఖాతాలో రూ.10 వేలు వేసి చేతులు దులుపుకుంటున్నారని, ఈ ఏడాది ఆ రూ.10 వేలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. హామీ ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేసింది చంద్రబాబు నాయుడని, అన్న క్యాంటీన్, విదేశీ విద్య, పండుగ కానుకలు, చంద్రన్న భీమా, పెళ్లి కానుకలు ఇచ్చింది చంద్రబాబు నాయుడే అన్నారు. రూ.200 ఇస్తున్న పెన్షన్ రూ. 1800లు పెంచి, రూ.2000 చేస్తే జగన్ వచ్చిన తరువాత అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారని దుయ్యబట్టారు. పండుగ కానుకలు, పెళ్లి కానుకలు, విదేశీ విద్య, అన్న క్యాంటీన్, 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది సిఎం జగన్ కాదా అని ప్రశ్నించారు. కరెంట్ ఛార్జీలు ఏడు సార్లు పెంచాడని, 8వ సారి మళ్లీ పెంచబోతున్నాడన్నారు. ఆర్టీసి ఛార్జీలు మూడు సార్లు పెంచి పెట్రోల్, డీజిల్ ధరల్లో జగన్ దేశంలోనే నంబర్ వన్ అని, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానికి అంటాయన్నారు. సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన చరిత్ర జగన్‌కి మాత్రమే దక్కిందని ఆరోపించారు. టిడిపి మహిళా రాష్ట్ర అధ్యక్షులు అనిత మాట్లాడుతూ జగన్ పరిపాలనలో మహిళలకు గౌరవం, రక్షణ, భరోసా లేవన్నారు. వైసిపి పాలనలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని, గంజాయి మత్తులో మగాళ్ళు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి అమర్‌నాథరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కంభం నిరంజన్‌రెడ్డి, సర్పంచ్ మహిత, నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










