టిడిపికి బిసిలు అండగా ఉండాలి
- మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
ప్రజాశక్తి-కావలి : తెలుగుదేశం పార్టీకి అండదండలిచ్చి రానున్న ఎన్నికల్లో గెలిపించాలని, బి.సి.లపై కక్షగట్టి, వారి సంక్షేమాన్ని కాజేసిన జగన్‌రెడ్డిని గద్దెదించాలని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. గురువారం రోడ్‌షోలో పాల్గొన్న టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాత్రికి పట్టణంలోని బృందావనం కాలనీ కళ్యాణ మండపంలో బస చేశారు. శుక్రవారం ఉదయం ఆయన ''బి.సి.లకు ఇదేమీ ఖర్మ'' పేరుతో బి.సి.లతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బి.సి.కులాలైన యాదవ, గమండ్ల, భట్రాజు, విశ్వ బ్రాహ్మణ, మత్స్యకార, తదితర కులాలకు చెందిన ప్రతినిధులు తమకు వైసిపి ప్రభుత్వంలో ఎలాంటి ఆర్థిక పథకాలు అందలేదని, తామంతా బి.సి.లకు అండ అయిన టిడిపిని గెలిపిస్తామని తెలిపారు. అనంతరం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ గతంలో టిడిపి పరిపాలించిన 5ఏళ్లలో 120 కులాలకు చెందిన బి.సి.లకు 1000కోట్లు రూపాయలు సంక్షేమం అందజేశామన్నారు. మత్స్యకార సొసైటీలకు చెరువులు, రిజర్వాయర్లు ఏర్పాటుచేసి జీవనోపాధి కల్పించామన్నారు. 15.74 లక్షలమంది మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో ఒక్కొక్కరికి రూ.4,500నగదు, 25కిలోల బియ్యం, పప్పులు, ఉప్పు, పంచదార, చింతపండు అందజేశామన్నారు. 18 యూనివర్శిటీలుంటే వాటిలో 9 యూనివర్శిటీలకు బి.సి.లను పెట్టామన్నారు. 80 ప్రతిష్టాత్మక నామినేటెడ్ పదవుల్లో బి.సి.లను పెట్టామని గుర్తుచేశారు. టిడిపి ప్రభుత్వ సలహాదారుల్లో 30మంది బి.సి.లుండేవారన్నారు. 3.75లక్షల మందికి కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పధకాలు అందజేశామన్నారు. అదే జగన్‌రెడ్డి పరిపాలనలో బి.సి.లపై కక్ష సాధింపులు చేశారని విమర్శించారు. నిత్యావసర వస్తువులు తీసేసి కేవలం లక్షమందికి మాత్రమే అందజేశారన్నారు. యూనివర్శిటీల్లో జగన్‌రెడ్డి సామాజికవర్గం వారికే వి.సి.లుగా నియామకాలిచ్చారన్నారు. బి.సి.ల నుంచి బలవంతంగా 8వేల ఎకరాల భూములను లాక్కున్నారన్నారు. 468మంది బి.సి.లపై దాడులు చేయాంచారని విమర్శించారు. టిడిపిలోని బి.సి.నేతలు అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, యనమల రామకృష్ణుడు, బీద రవిచంద్ర, కాలవ శ్రీనివాసులుపై దాడులు చేయించారని తెలిపారు. తప్పుడు కేసులు పెట్టి జైల్లో కూడాపెట్టించారని తెలిపారు. బి.సి.కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని విమర్శించారు. 5ఏళ్లలో తాము బి.సి.ప్లాన్‌కి రూ.46వేలకోట్లు ఖర్చుపెడితే, జగన్ మూడేళ్లలో ఒక్కరూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. బి.సి.లకు స్వయం ఉపాధికి ఏటా 3వేల కోట్ల రూపాయలు రుణాలందజేస్తే, జగన్ 34648కోట్ల బి.సి.ల నిధులను దారి మళ్లించారన్నారు. 34శాతం రిజర్వేషన్ కొనసాగింపుతో వేలాదిమందికి తాము పదవులు ఇస్తే, వారు రిజర్వేఫషన్‌తీసేయడంతో 16,800 రాజకీయ పదవులకు బి.సి.లను దూరం చేశారన్నారు. తాము బి.సి.లకు పెళ్లి కానుకలిస్తే, వారు పెళ్లి కానుకను రద్దు చేశారన్నారు. 221.47కోట్లతో 1187 కమ్యూనిటీ హాళ్లు, 12 బి.సి.భవనాల నిర్మాణాలు టిడిపి చేస్తే, వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మాణాలను నిలిపి వేశారన్నారు. తాము 964 కోట్లతో ఆదరన పనిముట్లు ఇస్తే, వారు పనిముట్లు ఇవవ్వలేదని, ఆదరన పథకాలు రద్దు చేశారని, 47కోట్లు స్వాహా చేశారని తెలిపారు. రాయితీలు ఎత్తివేశారన్నారు. 11.63మంది రజకులుంటే కేవలం 82వేలమంది రూ.10వేలు విదిలించారని తెలిపారు. ఇంతటి కక్ష పూరితమైన వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దింపి, బి.సి.లకు అండదండగా ఉండే టిడిపిని గెలిపిస్తే తాము బిసిలను ఆదుకుంటామని చంద్రబాబునాయుడు హామీనిచ్చారు. ఈ సదస్సు మాజీమంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరుగగా, జాతీయ కార్యదర్శి బీద రవిచంద్ర, కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు, పలువురు బి.సి.నాయకులు పాల్గొన్నారు.










