పీలేరు : అనపర్తిలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకోవడం అవివేక చర్య అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి తెలిపారు. శనివారం పీలేరులో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషోర్ మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం టిడిపి నేత సభకు అనుమతులు ఇచ్చినట్టే ఇచ్చి చివరి క్షణంలో రద్దు చేయడం, వాహనాలు అడ్డుపెట్టడం పోలీసులను చంద్రబాబు నాయుడు అడ్డు తొలగండి అంటూ చెప్పినా, పోలీసులు ససేమిరా అంటూ స్పందించక పోవడం దారుణమని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను ప్రభుత్వం పావులుగా వాడుకుంటూ టిడిపి కార్యక్రమాల్ని అడుగడుగునా అడ్డుకోవడం హాస్యా స్పదంగా ఉందని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎలాంటి అవాంతరాలు సృష్టించినా టిడిపి జనసునామీలో కొట్టుకు పోవడం ఖాయమన్నారు. పీలేరు పట్టణంలో ప్రముఖ నాయకులు డాక్టర్ పి.హేమచంద్రారెడ్డితో పాటు పలు గ్రామస్తులు కిషోర్ కుమార్‌రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన అందరిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎవరూ ఎవరికీ భయపడాల్సిన పనిలేదని, అందరికీ తాను అండగా ఉంటానని, ఏ సమస్య వచ్చినా ముందు ఉంటానని, రాష్ట్రంలో ఇక వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమన్న భరోసా కార్యకర్తలకు ఇచ్చారు. ఈ నెలలో జరగబోయే నారా లోకేష్ యువ గళం పాదయాత్ర సందర్భంగా కాకులారంపల్లి, వేపులబైలు గ్రామాల్లో సభ కోసం స్థల పరిశీలన చేశారు. అనంతరం పీలేరు నియోజకవర్గంలో మూడు రోజుల పాటు జరిగే పాదయాత్ర సందర్భంగా టిడిపి కార్యకర్తలు, నాయకులు, అనుబంధ సంఘాలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి చల్లా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అనపర్తిలో వైసిపి నాయకులు, పోలీసుల తీరును ప్రజలు గమనిస్తున్నారని, పోలీసులే ధర్నాకు దిగడం పోలీసు వ్యవస్థకే మచ్చన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు నల్లారి అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.










