ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : బుక్కపట్నం మండలానికి చెందిన పేదరాసు సుబ్రహ్మణ్యం తో పాటు మరో ఐదుగురిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు టిడిపి నాయకులు తెలిపారు. సోమవారం టిడిపి స్థానిక కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల కన్వీనర్లతో మాజీ మంత్రి నియోజకవర్గ ఇంచార్జ్ పల్లె రఘునాథ రెడ్డి సమావేశం నిర్వహించారు. బుక్కపట్నం మండలం రాసింపల్లి సమీపంలో తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అంబులెన్స్ రమేష్ పై పేదరాసు వరదప్ప, లక్ష్మీనారాయణ, రాజు, చెన్నప్ప అను వ్యక్తులు ఆదివారం దాడి చేయడాన్ని నియోజకవర్గ కమిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. సామాజిక మధ్యమాలలో పేదరాసుపై వ్యాఖ్యలు చేసినందుకు ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ పార్టీలో ఉంటూ పార్టీ నాయకుల పైనే భౌతిక దాడులకు దిగడం సరైనది కాదన్నారు. ఏదైనా సమస్య ఉంటే అధిష్టానం దృష్టికి తేవాలన్నారు. ఇలా చేయడం పద్ధతి కాదన్నారు. నియోజకవర్గ కమిటీ వారిపై బహిష్కరణకు తీర్మానం చేసిందని ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. అనంతరం బాధితులు రమేష్ తో పాటు నాయకులు ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల కన్వీనర్లు, జిల్లా పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.










