తహశీల్దారు ఏకపక్ష నిర్ణయం
- బాధితులు కూరపాటి, ప్రసాద్ సునంద ఆరోపణ
ప్రజాశక్తి-కావలి : జలదంకి మండలం దాసరి అగ్రహారం గ్రామంలో సర్వే నెంబర్ 927/1,2 లలో ఇరువురి మధ్య పొలం వివాదం కేసు కోర్టులో నడుస్తుంటే, జలదంకి తహశీల్దార్ ఏకపక్షంగా ఒకరికి అనుకూలంగా, తమకు వ్యతిరేకంగా చేస్తూ నియంతలా వ్యవహరిస్తుందని దాసరి అగ్రహారం బాధితులు కూరపాటి ప్రసాద్, సునంద ఆరోపించారు. బుధవారం పట్టణంలోని ''జర్నలిస్ట్ క్లబ్''లో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ 2006 సంవత్సరంలో పసుపు కుంకుమల కింద తన తండ్రి నారా మల్లయ్య జలదంకి మండలం దాసరి అగ్రహారం గ్రామంలో 9 ఎకరాల 60 సెంట్లు భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారని కూరపాటి సునంద, మహేష్ తెలిపారు. అయితే 2007 సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన మేకల రామయ్య అనే అతను 3 ఎకరాల9 సెంట్లు భూమి తనది అని వస్తే తాము కోర్టుకు వెళ్లామన్నారు. అప్పటి నుంచి ఈ వివాదం కోర్టులో నడుస్తుందని తెలిపారు. అయితే తాజాగా తాము మినుమ పంట వేసి ఉంటే తహశీల్దార్ అనుమతితో తన పొలంలో బోర్డులు నాటి, తన పొలం ఉన్న మినుమ పంటను దున్నేశారన్నారు. దీంతో తమకు రూ.2 లక్షలు నష్టం వాటిలిందన్నారు. ఈ విషయాన్ని తహశీల్దారుకు తెలియజేస్తే ఆమె స్పందించలేదన్నారు. అనంతరం కావలి ఆర్‌డిఒతోపాటు జిల్లా కలెక్టర్‌కు స్పందనలో జరిగిన విషయాన్ని అర్జీ రూపంలో ఇచ్చామన్నారు. కానీ తమకు ఇంతవరకు న్యాయం చేయలేదన్నారు. అసలు కోర్టులో ఉన్న వివాదాన్ని తహశీల్దారు పొలంలో బోర్డులు నాటించి, దున్నేటట్లు చేసే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తున్నామన్నారు. అలానే దీని వెనుక అధికార పార్టీ నేతలతో పాటు విఆర్‌ఒ, ముదాంకు సంబంధాలు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించకపోతే న్యాయస్థానం ద్వారానే వారికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నారా క్రిష్ణారావు తదితరులున్నారు.










