ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ : మదనపల్లి-తిరుపతి జాతీయ రహదారికి కోసం మట్టిని కోసం అనుమతులు తీసుకొని పేదల భూములను ఆక్రమించుకున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మండలంలో భూ కబ్జాలు అరికట్టడంలో విఫలమైన మదనపల్లె తహశీల్దార్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గురువారం మదనపల్లి-తిరుపతి జాతీయ రహదారి పక్కన ఉన్న బసినికొండ రెవెన్యూ గ్రామం సర్వేనెంబర్ 1130లో ఉన్న పేదల భూములను ఆక్రమించుకున్న కాంట్రాక్టర్ మట్టిని తరలిస్తూ రహదారికి వాడుకోవడమే కాకుండా ప్రయివేట్ వ్యక్తులకు అమ్ముకుంటు ఉండటాన్ని గమనించిన సిపిఎం నేతలు స్థానిక పేదలతో కలిసి పనులను అడ్డుకున్నారు. హిటాచి, జెసిబి, టిప్పర్లను అడ్డుకుని అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ 987 సర్వే నంబర్లో అనుమతులు తీసుకున్న హైవే కాంట్రాక్టర్ 1130 సర్వే నెంబర్లో పేదల పేర్లతో ప్రభుత్వం మంజూరు చేసిన భూములను ఆక్రమించుకుంటున్నారని విమర్శించారు. పేదలకు పట్టాలు ఉండి ప్రభుత్వ సౌకర్యాలు అన్ని పొందుతున్నారని, విత్తనాలు మంజూరు చేయడం రైతు భరోసా పొందడం జరుగుతున్న సరే వారికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా భూములను ఆక్రమించుకోవడమే కాకుండా, మట్టిని తవ్వుకొని అక్రమంగా తరలించడానికి ప్రశ్నించాల్సిన రెవెన్యూ అధికారులు చోద్యం చూడడమే కాకుండా, కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మదనపల్లి మండలంలో వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, పేదల భూములు, ప్రభుత్వ భూములు అన్నీ కబ్జాకు గురవుతున్నా కూడా రెవెన్యూ అధికారుల్లో స్పందన కరువైందని అన్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని కబ్జాలపైన సమగ్ర విచారణ జరపాలని, కబ్జాలకు బాధ్యత వహిస్తూ తహశీల్దారును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు న్యాయం చేయకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ప్రజలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న తహశీల్దార్ సికె.శ్రీనివాసులు మాట్లాడుతూ పేదల భూములకు ఎలాంటి నష్టం చేకూర్చమని ఇప్పటిదాకా జరిగిన నష్టానికి కాంట్రాక్టర్ నుంచి భూములు చదును చేయించి, నష్టపరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్టర్ కు కేటాయించిన భూముల్లోనే మట్టి ఎత్తుకోవాలని పేదల భూములకు జోలికి రాకూడదని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి డి.ప్రభాకర్‌రెడ్డి, నాయకులు కృష్ణప్ప, మురళి స్థానికంగా ఉన్న పేదలు పాల్గొన్నారు.










