- సగటున రోజుకు రూ.173
- గతేడాది కంటే రూ.34-85 తక్కువ
- ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే అత్యల్ప వేతనం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఉపాధి కార్మికుల సగటు వేతనం భారీగా తగ్గింది. చట్టం ప్రకారం రోజుకు 257 రూపాయలు వేతనంగా రావాల్సిఉండగా, కార్మికులకు రూ.133 నుండి రూ.211కు మించి లభించడంలేదు. గతేడాది సగటున రూ.221 వేతనం లభించింది. ఈ సంవత్సరం ఒక్కసారిగా రూ.34 నుండి 85 రూపాయల వరకు తగ్గిపోయింది. పని దినాల్లో భారీ కోత విధించడమే ఈ పరిస్థితికి కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతేడాది ఉపాధి హామీ చట్టం కింద వేతనం రోజుకు రూ.245 ఉండగా, ఈ ఏడాది దానిని రూ.257కు పెంచారు. అయినప్పటికీ, వేతనం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి 14 కోట్ల పని దినాలను కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంజూరు చేసింది. కేంద్రం మంజూరు చేసిన పని దినాలను ఏప్రిల్ నుండి వచ్చే ఏడాది మార్చి వరకు విభజన చేశారు. ఆ ప్రకారం ఈ నెలలో 2.10 కోట్ల పని దినాలను పూర్తి చేయాల్సి ఉంది. రాష్ట్రంలో సుమారు 47 లక్షల కుటుంబాలుండగా, ఎనిమిది లక్షల కుటుంబాలే ఉపాధి పనులకు హాజరవుతున్నాయి. ఆ కుటుంబాలకు ఇప్పటి వరకు అధికారులు 68 వేల పని దినాలను మాత్రమే కల్పించారు. అంటే మొత్తం పని దినాలలో ఐదు శాతమే పని కల్పించారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం జాబ్‌కార్డున్న ప్రతి కుటుంబానికి ఏడాదిలో వంద రోజులపాటు పని కల్పించాల్సి ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉపాధి హామీ పనులకు సగటు వేతనం రూ.173గా ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో రూ.133 నుండి రూ.144గా ఉంది. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో రూ.156 నుండి రూ.188గా, రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కడపతోపాటు తూర్పు గోదావరి జిల్లాలో రూ.184 నుండి 211 రూపాయలుగా ఉంది. గత సంవత్సరం ఇదే నెలలో సగటు వేతనం రూ.218 ఉంటే, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రూ.207 నుండి రూ.217గా ఉంది.
కేంద్రం కోత పెట్టడం వల్లే..
గతేడాది 24 కోట్ల పని దినాలను రాష్ట్రం వినియోగించుకోగా, ఈ సంవత్సరం కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ 14 కోట్ల పని దినాలనే మంజూరు చేసింది. గత సంవత్సరం తొలుత 23 కోట్ల పని దినాలను కేంద్రం మంజూరు చేయగా, చివర్లో మరో కోటి పని దినాలు అదనంగా మంజూరయ్యాయి . రాష్ట్రంలో ఉపాధి పనికి డిమాండ్ పెరుగుతుండటంతో, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అధికారులు ఈ ఏడాది 30 కోట్ల పని దినాలను కేటాయించాలని ప్రతిపాదనలు పంపించారు. అయినప్పటికీ, అందులో సగ కూడా కేంద్రం మంజూరు చేయలేదు. ఒక్కసారిగా పని దినాలు తగ్గాయి. మరోవైపు ఈ పథకం కింద పనులు అడుగుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అడిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తుండటంతో వేతనాలు తగ్గుతున్నట్లు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించే ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఒకరు తెలిపారు. పది మంది చేసే పనులకు రెండింతల కార్మికులు వెళుతుండటంతో వేతనాలు భారీగా తగ్గుతున్నాయి. ఉపాధి పని చూపించకపోతే ఉన్నతాధికారుల నుంచి తాము ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తుందని, అందుకే ఎంత మంది ఉంటే అంత మందిని ఉన్న పనులకే పంపిస్తున్నట్లు ఉపాధి మేట్ ఒకరు తెలిపారు.
ఆరంభంకాని జలవనరుల పనులు
వేసవిలో ఏటా జలవనరులశాఖ ఆధ్వర్యంలో చెరువులు, నీటి కుంటలు, పంట బోదెలలో పూడిక తీత పనులను ఈ పథకం లో భాగంగా చేపడుతారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆ దిశలో ప్రణాళికలే సిద్ధం కాలేదు. దీంతో పలు జిల్లాల్లో ఉపాధి పనులు ఇంకా ఊపందుకోలేదు.
పెరిగిన ధరలతో బతుకు భారమే..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి నిత్యావసరాలతోపాటు పెట్రోల్, డీజిల్, విద్యుత్ చార్జీలు, ఆర్‌టిసి బస్సు చార్జీలను పెంచడంతో పేద ప్రజల బతుకు భారంగా మారుతోంది. అత్యల్పంగా వచ్చే వేతనాలతో నిత్యావసరాలను కొనుగోలు చేయాలంటేనే కార్మికులు భయపడుతున్నారు. ఉపాధి వేతనాన్ని కనీసం రూ.600 చేయాలనే డిమాండ్ ఉన్నప్పటికీ, కేంద్రం పట్టించుకోవడంలేదు. ప్రస్తుతం వస్తున్న రోజువారీ వేతనం రూ.173 ప్రకారం నెలకు ఒక్కో కార్మికుడికి రూ.4 వేలకు మించి లభించదు. పెరిగిన ధరలతో తమ జీవితాలను ఎలా సాగించాలని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.











