Jul 11,2021 15:01

అమరావతి : పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఐఎండి సూచించిందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు ఆదివారం వెల్లడించారు. ఈ అల్పపీడనం ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇరోజు, రేపు కోస్తాంధ్రాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రాయలసీమలోనూ ఇదేరకమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయన్నారు. రాయలసీమలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయన్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. సముద్రం అలజడిగా ఉంటుందని, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు ఎవరూ మంగళవారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేశారు.

తెలంగాణపై ఉపరితల ద్రోణి..
తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య గాలుల ప్రభావంతో తెలంగాణపై ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు అధికారులు తెలిపారు. రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రెండు రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని స్పష్టం చేశారు.