హుజూరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి కౌశిక్ రెడ్డి ఆ పార్టీని వీడారు. తన లేఖను నేరుగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి పంపారు. టిపిసిసి క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు అందుకున్న 24 గంటల్లోనే కౌశిక్ రెడ్డి రాజీనామా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. కౌశిక్‌రెడ్డి కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ.. టిఆర్‌ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్లు ఫిర్యాదులు అందినట్లు కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ కోదండ రెడ్డి సంజాయిషి కోరుతూ నోటీసులో పేర్కొన్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నిక తథ్యమైన హుజూరాబాద్‌లో.. టిఆర్‌ఎస్ తనకే టికెట్ ఇస్తుందని ఫోన్‌లో కౌశిక్ రెడ్డి స్థానిక నాయకులతో చెప్తున్నట్లు ఉన్న ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో టిపిసిసి క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. గతంలో కౌశిక్‌రెడ్డిని పిసిసి క్రమశిక్షణా సంఘం హెచ్చరించిన విషయం తెలిసిందే.










