ప్రజాశక్తి - గంపలగూడెం
ముడతలు, కొమ్మ కుళ్ళుతో నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని ఎన్టీఆర్ జిల్లా రైతు సంఘం కార్యదర్శి పివి ఆంజనేయులు డిమాండ్ చేశారు. మండలంలోని లింగాల, సుబ్బాల, ఎరుకపాడు, కొమ్మిరెడ్డిపల్లి, గొల్లపూడి తదితర గ్రామాల్లో మిర్చి పంటలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ తిరువూరు, గంపలగూడెం, మండలాల్లో ఈ ఏడాది పెద్ద మొత్తంలో రైతులు మిర్చి సాగు చేస్తున్నారన్నారు. 50 రోజుల కాలవ్యవధిలోనే మిర్చి పంటలకు అనేక వ్యాధులు సోకడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పంటలకు వివిధ వ్యాధులు సోకుతున్నప్పటికీ సలహాలు సూచనలు చేయాల్సిన సంబంధిత అధికారులు కన్నెత్తి చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిశీలించి, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కౌలు రైతులు సంఘం కార్యదర్శి గువ్వల సీతారామిరెడ్డి, గంపలగూడెం మండల రైతు సంఘం కార్యదర్శి మద్ది రెడ్డి వెంకటరెడ్డి, అధ్యక్షులు జి వీరభద్రం, సిఐటియు కార్యదర్శి జే వెంకటేశ్వరరావు, తిరువూరు మండలం రైతు సంఘం కార్యదర్శి సాంబారు వెంకటేశ్వరరావు, రెండు మండలాల రైతులు పాల్గొన్నారు










