Jan 09,2023 21:26

తెగి కింద పడిన విద్యుత్‌ లైన్‌

           మడకశిర : పట్టణ పరిధిలోని బేగార్లపల్లి ఎవిఎస్‌ గార్మెంట్స్‌ సమీపంలో సోమవారం ఉదయం 11 కెవి విద్యుత్‌ లైను తెగి కింద పడింది. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణ సమీపంలోని బేగార్లపల్లి వద్ద ఉన్న ఎవిఎస్‌ గార్మెంట్స్‌ నుంచి కొద్ది దూరం వెళ్లిన తర్వాత విద్యుత్‌ స్తంభం నుంచి 11 కేవీ విద్యుత్‌ లైను తీగ ఉన్నఫలంగా తెగిపడింది. మడకశిర నుంచి అమరాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెళ్లిన తర్వాత విద్యుత్‌ తీగ తెగి కింద పడిపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. విద్యుత్‌ తీగ కింద పడటంతో దాదాపు అరగంటకుపైగా మడకశిర, గుడిబండ అమరాపురం ప్రాంతాలకు వెళ్లే ప్రజలు వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. వెంటనే స్థానికులు విద్యుత్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో హుటాహుటిన వారు ఘటనా స్థలానికి చేరుకుని తెగిన విద్యుత్‌ తీగలకు మరమ్మతులు చేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. ఇప్పటికైనా విద్యుత్‌ అధికారులు స్పందించి ప్రధాన రహదారుల వద్ద ప్రమాదస్థితిలో ఉంటున్న వాటిని ముందస్తుగా గుర్తించి మరమ్మతులు చేపట్టాలని ప్రజల కోరుతున్నారు.