ప్రజాశక్తి - పుట్టపర్తి అర్బన్ : ఇండియన్ గ్యాస్ వినియోగదారులకు ఇకపై తేలికపాటి భద్రతతో కూడిన కాంపోజిట్ సిలిండర్లు అందుబాటులోకి వచ్చాయని ప్రశాంతి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు పివి. రాజీవ్ దేవ్ తెలిపారు. మంగళవారం ఆయన ప్రజాశక్తితో మాట్లాడారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుండి సరికొత్త ఇండియన్ ఎల్‌పిజి కాంపోజిట్ సిలెండర్లను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఇటీవలే కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వంశీ కష్ణారెడ్డి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగిందన్నారు. ఇవి ప్రస్తుతం వాడుతున్న సిలిండర్ల కంటే అన్ని విధాల సురక్షితమైనవన్నారు. పూర్తి భద్రత కలిగి, ప్రధానంగా పేలుడు నియంత్రణ కలిగి ఉంటుందన్నారు. ప్రస్తుత సిలెండర్ కన్నా 50 శాతం బరువు తక్కువ కలిగి ఉంటుందని గ్యాస్ ఎంత నిలువ ఉందో గుర్తించడానికి వీలుంటుందని చెప్పారు. దీనితో ఎలాంటి ఇబ్బంది లేకుండా రీఫిల్ బుకింగ్ చేసుకోవచ్చన్నారు. 10 కేజీలతో పాటు ఐదు కేజీల గ్యాస్ పొందుటకు వీలుగా ఈ సిలెండర్లను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. 10 కేజీల సిలెండర్ పొందడానికి రూ. 3350, 5 కేజీల సిలెండర్ పొందడానికి 2150 రూపాయల చెల్లించవలసి ఉంటుందన్నారు. ప్రస్తుతం వినియోగదారుల వద్ద ఉన్న సిలిండర్ తీసుకువచ్చి గతంలో చెల్లించిన డిపాజిట్ మొత్తం మినహాయించి మిగిలిన మొత్తం చెల్లించి సిలిండర్ పొందవచ్చని చెప్పారు. కొత్తగా కనెక్షన్ పొందేవారు డిపాజిట్ చెల్లించి సిలిండర్ కొత్తగా పొందవచ్చు అన్నారు. మరిన్ని వివరాల కోసం ప్రశాంతి గ్యాస్ ఏజెన్సీ లో సంప్రదించవచ్చని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.










