తారకరత్న మరణం బాధాకరం
ప్రజాశక్తి-కావలి : నందమూరి తారకరత్న అకాల మరణానికి చింతిస్తున్నామని ఆదివారం కావలి పట్టణ ఏరియా ఆసుపత్రి ఎదురుగా కావలి టిడిపి తరఫున భారీ సంఖ్యలో పాల్గొన్న అభిమానుల మధ్య నివాళులుఅర్పించారు. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు హాజరై, చిత్రపటానికి పూలు వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తారకరత్న ఇక లేడనే వార్త మనసును తొలిచివేసిందని, టిడిపి కుటుంబ సభ్యులు, నందమూరి వంశ అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉందన్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని, వారు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు అన్నపూర్ణ, శ్రీను, పోతుగంటి శ్రీకాంత్, చవల రామకృష్ణ, రఫీ, తటవర్తి వాసు, మంచాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










