తాగునీటి సమస్యపై దృష్టి పెట్టండి
ప్రజాశక్తి-అల్లూరు : మండలంలో వేసవికాలంలో నెలకొనే తాగునీటి సమస్యపై దృష్టి సారించాలని ఎంపిపి దర్శిగుంట శశిరేఖ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయ సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని తెలియజేశారు. అలాగే కావలి ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం శ్రమిస్తూ శాయశక్తుల కష్టపడుతున్నారని తెలిపారు. అనంతరం ఎంపిడిఒ శ్రీదేవి మాట్లాడుతూ పంచాయతీల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా వేసవి కాలంలో తాగునీటి సమస్యపై ప్రధానంగా దృష్టి పెట్టి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా గ్రామాలలో ప్రజలకు వెన్నుదన్నుగా నిలవాలన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.










