Mar 01,2023 21:39

ఫొటో : మాట్లాడుతున్న కావలి ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
ప్రజాశక్తి-అల్లూరు : తాగునీటి సమస్యకు త్వరలో పరిష్కార మార్గం చూపుతానని కావలి ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం మండల కేంద్రంలోని నగర పంచాయతీ కార్యాలయంలో పలు సమస్యలపై ఆయన దృష్టి సారించారు. పలువురు ప్రజలు గత 10 రోజుల నుండి తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అలాగే 18 అంకణాల ఇళ్ల స్థలం కారణంగా పింఛన్లు తీసివేశారని అల్లూరు నగర పంచాయతీని రద్దు చేసి పంచాయతీలుగా కొనసాగించాలని విన్నవించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.73 కోట్లతో తాగునీటి సమస్య తీరుస్తానని హామీనిచ్చారు. బడ్జెట్‌ సమావేశాలలో నగర పంచాయతీ సమస్యను సిఎం దృష్టికి తీసుకెళ్లి రద్దు చేసే బాధ్యత నాది అంటూ భరోసానిచ్చారు. ప్రతి రైతు ఈ-కెవైసి తప్పనిసరిగా చేసుకోవాలని తద్వారా ఎంతో ఉపయోగకరమని వివరించారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రతినెలా తహశీల్దార్‌ కార్యాలయం, నగర పంచాయతీ కార్యాలయాలకు వచ్చి తానే స్వయంగా సమస్యల పరిష్కరిస్తానని తెలియజేశారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ దండా కృష్ణారెడ్డి, నీలం సాయికుమార్‌, కోడూరు సాధక్‌కుమార్‌ రెడ్డి, నగర పంచాయతీ కమిషనర్‌ ఫణి కుమార్‌ తదితరులున్నారు.