తాగునీరు అందించాలి : సిపిఎం
ప్రజాశక్తి-కావలి : పట్టణంలో పేదలు నివసించే ఏరియాల్లో ప్రజలకు పూర్తిగా తాగునీటి సరఫరా జరిగేట్లు చర్యలు చేపట్టాలని, కోరుతూ, సోమవారం ఆర్.డి.ఒ. వి.కె.శీనానాయక్‌కు సిపిఎం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సి.పి.ఎం. పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ పట్టణంలో పలు ప్రాంతాల్లో ప్రతిరోజూ తాగునీరు సరఫరా జరగడం లేదన్నారు. అందువల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తాగునీటి సరఫరా లేని ప్రాంతాల్లో మున్సిపాలిటీ తాత్కాలికంగా ట్యాంకర్లతో అరకొరగా తోలుతున్నారని ఆరోపించారు. పట్టణంలోని ముసునూరు, చంద్రబాబు నగర్, ఇందిరమ్మ గ్రీన్ సిటీ, బుడమగుంట కాలనీలు, సుచేతా నగర్, వెంగాయగారిపాలెం, ఇంకా మరికొన్ని ప్రాంతాలకు కొన్ని నెలలుగా మున్సిపాలిటీ వాటర్ సరఫరా కావడం లేదన్నారు. అంతేగాక కొన్ని ప్రాంతాలకు ఇప్పటికి పూర్తిగా నీటి సరఫరా కావడం లేదని తెలిపారు. ట్యాంకర్ల ద్వారా తోలుతున్న నీళ్లు 3రోజులకు, 5రోజులకు ఒకసారి పోస్తున్నందున చాలీచాలని నీళ్లతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యంగా పట్టణానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉన్నప్పటికీ, అమత్ పథకం కింద నీటి సమస్యలు తీర్చేందుకు సుమారు రూ.200కోట్లకుపై బడి నిధులు మంజూరు అయినప్పటికీ పూర్తిగా నీటి సమస్య పరిష్కారం కాలేదన్నారు. కనుక వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని పట్టణ ప్రజలకు ప్రతిరోజూ పూర్తిగా నీటి సరఫరా జరిగేటట్లు చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సి.పి.ఎం. నాయకులు వై.కృష్ణమోహన్, జి.మధుసూధన రావు, బాబురావు, తదితరులు పాల్గొన్నారు.










