Oct 16,2023 12:29
  • జయప్రదం చేయాలని సిపిఎం పిలుపు
  • గోడ పత్రిక ఆవిష్కరణ

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విద్యుత్ చార్జీలు పెంపుదల కు వ్యతిరేకంగా ఈ నెల 19న విజయనగరంలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక ఎల్.బి.జీ భవనంలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ బిల్లులు చూడగానే షాక్ కొదుతుందన్నారు. పెరిగిన బిల్లులతో జనం గగ్గోలు పెడుతున్నారనీ అన్నారు. విద్యుత్ వాడకం పెరగటం కాదు, ప్రభుత్వం ఒకేసారి సర్దుబాటు చార్జీలు పేరుతో మూడు పోట్లు పొడిచిందనీ అన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కయి ప్రజలకు షాక్ ఇస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరం కరెంటు చార్జీలు పెంచి 1400 కోట్ల రూపాయల భారం మోపిందనీ గుర్తు చేశారు.స్లాబులు మార్చేశారనీ విమర్శించారు. ప్రజల కళ్ళు కప్పి గత పది ఏళ్ల నుంచి వాడుకున్న కరెంటుకు 'బిల్లులు కట్టినా మళ్లీ సర్దుబాటు చార్జీల పేరుతో జనం నెత్తిన తాజాగా 6 వేల కోట్ల రూపాయలు భారం వేశారన్నారు. నాలుగేళ్లలో 25 వేల కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన మోపారనీ తెలిపారు. ఈనెల బిల్లులో 2014 సంవత్సరంలో వాడుకున్న కరెంటుకు మళ్ళీ యూనిట్ కి 20 పైసలు, 2021 మే నెలలో వాడిన విద్యుత్తు యూనిట్కు మరో 20 పైసలు, 2023 ఏప్రిల్ నెలలో ఉపయోగించిన కరెంటుకు యూనిట్కు 40 పైసలు కలిపి మొత్తం యూనిట్ కు 80 పైసలు చొప్పున జనం నెత్తిన భారం వేశారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారి టిడిపి, జనసేన పార్టీలు కూడా ప్రశ్నించకుండా పేదలకు అన్యాయం చేస్తున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే కార్పోరేట్ అనుకూల, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అక్టోబర్ 19న జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సదస్సుకు సిపియం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.తులసిదాసు, సి.హెచ్ నర్శింగరావు, సిఐటియు రాష్ట్రప్రధాన కార్యదర్శి పాల్గొని ప్రసంగించనున్నారన్నారు. అనంతరం రాష్ట్ర సదస్సు గోడపత్రికను ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.లక్ష్మి, ఆర్.శంకరరావు పాల్గొన్నారు.