- సిపిఎం ఆధ్వర్యంలో నేడు, రేపు సెమినార్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అసమానతలు లేని అభివృద్ధి కోసం 'ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి-ప్రత్యామ్నాయ విధానాలపై' శని, ఆదివారాల్లో విజయవాడలో సెమినార్ జరగనుంది. ఈ కార్యక్రమం ప్రారంభ సభకు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు ముఖ్యఅతిథిగా శనివారం హాజరుకానున్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగే ప్రారంభ సభ అనంతరం రాష్ట్ర, జిల్లా కేంద్రాల నుంచి ఎంపిక చేసిన ప్రతినిధులతో సెమినార్ జరగనుంది. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో 8 అంశాలపై ఆయా రంగాలకు చెందిన మేధావులు పాల్గొననున్నారు. తొలిరోజు 'వ్యవసాయ రంగం సంక్షోభం-రైతు రక్షణ', 'పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి, సేవారంగం', 'నీటి పారుదల రంగం-మౌలిక సదుపాయాలు, భూసేకరణ-పునరావాసం', 'విద్య, ఆరోగ్య రంగాలు' అనే నాలుగు అంశాలపై చర్చ జరగనుంది. రెండో రోజైన ఆదివారం 'సామాజిక తరగతులు-ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మహిళలు', 'ప్రాంతీయ అభివృద్ధి-వెనుకబాటుతనం-రాజధాని', 'స్థానికసంస్థలు - వికేంద్రీకరణ- సచివాలయాలు', 'విభజన చట్టం హామీలు-అమలు' అనే నాలుగు అంశాలపై చర్చ జరగనుంది.










