Secularism: మతోన్మాదంపై ఐక్య పోరాటం : ''లౌకికవాదం - సవాళ్లు'' సెమినార్లో ప్రకాశ్ కరత్
- హిందూత్వ విషయంలో రాజీ పడుతున్న కాంగ్రెస్ : కరత్
- లౌకికవాదాన్ని పరిరక్షించుకోవాలి : డి రాజా
కామ్రేడ్ సిహెచ్ కనరన్ నగర్ నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : దేశంలో పెచ్చరిల్లుతున్న హిందూత్వ మతోన్మాదంపై అన్ని వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ స్పష్టం చేశారు. లౌకికవాదంపై తీవ్రమైన దాడి జరుగుతుందని, దాంతోపాటు ప్రజాస్వామ్యం, ఫెడరలిజంపై కూడా దాడి జరుగుతుందని పేర్కొన్నారు. హిందూత్వంపై కాంగ్రెస్ పూర్తిస్థాయిలో పోరాటం చేయటం లేదని, లౌకికవాదంపై ఆ పార్టీ రాజీపడుతుందని అన్నారు. సిపిఎం 23వ అఖిల భారత మహాసభ సందర్భంగా కేరళలోని కన్నూర్‌లో కామ్రేడ్ సిహెచ్ కనరన్ నగర్ (టౌన్ స్క్వేర్) ''లౌకికవాదం-సవాళ్లు''పై సదస్సు జరిగింది. సిపిఎం కేంద్ర కమిటి సభ్యులు ఈపి జయరాజన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ప్రకాశ్ కరత్ మాట్లాడారు. ఈ సదస్సుకు కాంగ్రెస్ నేత శశిథరూర్‌ను ఆహ్వానించినా, ఆయన హాజరు కాకపోవడం బాధాకరమని అన్నారు. ఇదే లౌకికవాదంపై కాంగ్రెస్ చిత్తశుద్ధి ఏంటో స్పష్టమవుతుందని విమర్శించారు. ఇటీవలి కాంగ్రెస్ హిందూత్వానికి రాజీ పడుతుందని దుయ్యబట్టారు. కేరళలో రాజకీయంగా తమతో కాంగ్రెస్‌కు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చని, అయితే లౌకికవాదంపై కాంగ్రెస్ వెనక్కి తగ్గడం దారుణమని అన్నారు. బిజెపి హిందూత్వ విధానాల అమలకు కాంగ్రెస్ మద్దతు పలుకుతుందని, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అది తేటతెల్లం అయిందని అన్నారు. 50 శాతం లౌకికవాదం, 50 హిందూత్వమని కాంగ్రెస్ అంటుందని, దాన్ని తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. తాము లౌకికవాదానికే కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. లౌకివాదం, ప్రజాస్వామ్యం, ఫెడరలిజం కోసం జరిగే పోరాటాలకు వామపక్షాలు నాయకత్వం వహిస్తాయని స్పష్టం చేశారు. దేశంలో ప్రస్తుత బిజెపి ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ నియంత్రణలో పని చేస్తోందని, మెజారిటీవాదాన్ని ముందుకు తెస్తోందని విమర్శించారు. ఇది లౌకికవాదానికి తీవ్రమైన ముప్పు అని అన్నారు. దేశంలోని మోడీ సర్కార్ హిందూత్వ మతోన్మాదంపైన, నయా ఉదారవాద విధానాలపై ఏకకాలంలో పోరాటం చేయాలని సూచించారు.

సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ తమను బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు సూడో లౌకికవాదుని అంటున్నాయని, అయితే తామే నిజమైన లౌకికవాదులమని అన్నారు. లౌకిక వాద సూత్రాలకు విరుద్ధంగా బిజెపి చర్యలు ఉన్నాయని విమర్శించారు. లౌకికవాదాన్ని విచ్ఛిన్నం చేసి, దాని స్థానంలో హిందూత్వాన్ని తీసుకొస్తుందని దుయ్యబట్టారు. మోడీ హిందూత్వ విధానాలపై పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. తొలిత వివిధ అంశాలపై సిపిఎం, ఇతర నేతలు రాసిన ఐదు పుస్తకాలను ప్రకాశ్ కరత్, డి.రాజా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కన్నూర్ జిల్లా కార్యదర్శి ఎంబి జయరాజన్, సిపిఎం నేతలు ఎంబి గోవిందన్ మాస్టార్, రామచంద్రన్ కండపల్లి తదితరులు పాల్గన్నారు.










