ప్రజాశక్తి-శ్రీకాకుళం : విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం సిపిఎం చేపట్టిన ఉక్కు రక్షణ బైక్ యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుంది. ఈ యాత్ర శనివారం నాడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం చేరుకుంది. మధ్యాహ్నం కంచిలి నుండి సోంపేట మీదుగా ముందుకు సాగుతున్నది. ఈ సందర్భంగా కంచిలిలో అధికార పార్టీకి చెందిన జడ్పిటిసి ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు మాట్లాడారు. విభజన హామీలు గాలికి వదిలేసి, సమస్యల పరిష్కారం చేయకుండా ఎన్నో వేల కుటుంబాలకు ఉపాధి ఇస్తున్న ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని అన్ని పార్టీలు వ్యతిరేకించాలని కోరారు. ఇందుకు కృషి చేస్తున్న సిపిఎంని అభినందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులతో పాటు స్థానిక సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.














