Jan 30,2023 19:23

చెక్కు అందజేస్తున్న దృశ్యం


చెక్కు అందజేస్తున్న దృశ్యం
స్వయం ఉపాధిదారులకు ప్రభుత్వం అండ
నెల్లూరు:స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న రజక, నాయీబ్రాహ్మణ, ట్రైలర్స్‌ వత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, అందులో భాగంగానే 'జగనన్న చేదోడు' పథకంలో జిల్లాలోని 18,522 మంది లబ్దిదారులకు రూ.18.522 కోట్ల ఆర్థిక సహాయం అందజేసిందని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. సోమవారం పల్నాడు జిల్లా, వినుకొండ నుండి ''జగనన్న చేదోడు పథకం'' మూడో ఏడాది కింద లబ్దిదారుల ఖాతాలోకి జమ చేసే బహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో 3,30,145 మంది అర్హులైన రజక, నాయిబ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లకు రూ. 330.14 కోట్ల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ కు కలెక్టరేట్‌ లోని ఎస్‌.ఆర్‌ శంకరన్‌ హాల్‌ నుండి రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, కలెక్టర్‌ కె.వి.ఎన్‌. చక్రధర్‌ బాబు, బొందిలి కార్పొరేషన్‌ చైర్మన్‌ బి. కిశోర్‌ సింగ్‌, బి.సి కార్పొరేషన్‌ ఈడి బ్రహ్మానందరెడ్డి, డిఆర్‌డిఎ పిడి సాంబశివారెడ్డి, జిల్లా బిసి వెల్ఫేర్‌ అధికారి వెంకటయ్య, జగనన్న చేదోడు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, కలెక్టర్‌ చక్రధర్‌ బాబుతో కలసి జగనన్న చేదోడు పధకం కింద జిల్లాలోని 18,522 మంది లబ్దిదారులకు 18.522 కోట్ల రూపాయల మెగా చెక్కును అందచేశారు. అనంతరం మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాట్లాడుతూ, స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న రజక, నాయీబ్రాహ్మణ, ట్రైలర్స్‌ వత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటూ జగనన్న చేదోడు పధకం కింద ప్రతి సంవత్సరం 10 వేల రూపాయల వంతున 5 సంవత్సరాల పాటు ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పధకానికి సంబంధించి జిల్లాలో 3వ విడత కింద రజకులు, నాయీబ్రాహ్మణలు , టైలర్స్‌ సంబంధించి 18,522 మంది లబ్దిదారులకు రూ.10,000/-లు చొప్పున రూ.18.522 కోట్ల ఆర్ధిక సహాయాన్ని అందచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జగనన్న చేదోడు పధకం కింద జిల్లాలో మొత్తం మూడు విడతల్లో కలిపి 51 కోట్ల రూపాయల మేర ఆర్ధిక సహాయాన్ని అందచేయడం జరిగిందని మంత్రి వివరించారు.ఎక్కడైనా అర్హత వుండి సాంకేతిక కారణాలతో సంక్షేమ పధకం అందకపోతే, క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాటిని సవరించి సంక్షేమ పధకాలను అందించడం జరుగుచున్నదని మంత్రి తెలిపారు. ముందుగా మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి మంత్రి , కలెక్టర్‌ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.