Jan 22,2022 08:10
  • అంచనాలు తారుమారుతో తంటాలు
  • ఔట్‌కమ్‌ బడ్జెట్‌పైనా ఇదే అనిశ్చితి

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : సవరణ బడ్జెట్‌ కూర్పు శాఖాధిపతులకు శిరోభారంగా మారుతోంది. బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ముగిసిపోయే సంవత్సరానికి సంబంధించిన సవరణలను కూడా పెట్టి సభ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సవరణ బడ్జెట్‌ను రూపొందించడంలో అధికారులు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు.
   ఎప్పటికప్పుడు మారిపోయిన అంచనాలతో సవరణ బడ్జెట్‌ రూపకల్పనపై స్పష్టత రావడం లేదని చెబుతున్నారు. బడ్జెట్‌ ప్రతిపాదనల్లో రూపొందించిన గణాంకాలకు, ఇప్పుడు జరిగిన కేటాయింపులు, ఖర్చులకు భారీగా తేడాలుండటంతో గందరగోళం నెలకొంటోందని చెబుతున్నారు. ఏ శాఖకు ఎంత నిధులు ఇచ్చారు, దానిలో ఎంత ఖర్చు చేశారన్న వివరాలతో సవరణ బడ్జెట్‌ రూపొందించాల్సి ఉంటుంది. అయితే, ఈ ఏడాది కొన్ని శాఖలు చేసిన కేటాయింపులనే ఖర్చు చేయని పరిస్థితి ఉంటే, మరికొన్ని శాఖలు చేసిన కేటాయింపుల కన్నా ఎక్కువ ఖర్చు చేశాయి. దీంతో బడ్జెట్‌ లెక్కలకు, సవరణ లెక్కలకు మధ్య భారీ అంతరం పెరుగుతోంది. ఈ పరిస్థితి కాగ్‌ నుండి అభ్యంతరాలకు దారి తీసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
 

                                                                ఐదు ఆంక్షలు

ఈ నేపథ్యంలో సవరణ బడ్జెట్‌ అంకెలు సక్రమంగా ఉండాలని పేర్కొంటూ ఆర్థికశాఖ ఐదు ఆంక్షలను విధించింది. కొత్త పథకాలకు సంబంధించి, కొత్త పనులకు సంబంధించి, అదనపు నిధులు, కొత్త పోస్టుల ఏర్పాటు, కాడర్‌ స్థాయి పెంపు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకాలకు సంబంధించిన ప్రతిపాదనల అంశాలు సవరణ బడ్జెట్‌లో చూపించవద్దని పేర్కొంది. ఈ మేరకు అన్ని శాఖలకు సర్క్యులర్లు జారీ చేసింది. మరోవైపే అవుట్‌ట్‌కమ్‌ బడ్జెట్‌పైనా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనిలో వివిధ శాఖల లక్ష్యాలు, వాటిని సాధించిన తీరుతో పాటు కొత్త ఆర్థిక సంవత్సర ప్రణాళికలను వివరించాల్సి ఉంది. అయితే, సంక్షేమ పథకాల్లో తప్ప ఇతర అంశాల్లో పురోగతి అంతంతమాత్రంగానే ఉందన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. దీంతో వాటిని ఎలా వివరించా లన్న అంశంపై కూడా చర్చ జరుగుతోంది.