- ఎర్రజెండా నీడలో కడవరకు అలుపెరగని ప్రయాణం
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : మల్లు స్వరాజ్యం.. ఈ పేరే పోరాటానికి ప్రతిరూపం! ఉవ్వెత్తున ఎగిసే ఆవేశానికి చిహ్నం! వీరతెలంగాణ విప్లవ పోరాటంలో ఎగిసిన పతాక! మొలిచిన బందూక! ఆమె పేరు నాటి రజాకార్లకే కాదు... నేటి ప్రజాద్రోహులకు సింహస్వప్పమే! పోరాటమే జీవితంగా కడవరకు శ్వాసించి, ఎర్రజెండా నీడలో అసువులు బాసిన ధన్యజీవి ఆమె! భూస్వాముల కుటుంబంలో పుట్టి, పదకొండేళ్ల వయసులోనే ప్రజాజీవితంలోకి అడుగుపెట్టిన మల్లు స్వరాజ్యం చివరి వరకు పేదల పక్షానే నిలిచారు. ఆమె చేసిన పోరాటాలను సామాన్య ప్రజానీకం కథలుగా చెప్పుకుంటూ, పాటలుగా పాడుకుంటూ ఉండటం గమనార్హం.
ఇదీ కుటుంబ నేపధ్యం..
మల్లు స్వరాజ్యం ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యపేట డివిజన్ పరిధిలోని తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెం గ్రామంలో 1931 సంవత్సరంలో జన్మిం చారు. తల్లిదండ్రులు బీంరెడ్డి చొక్కమ్మ రాంరెడ్డి. వీరి కుటుంబం సుమారు 600 ఎకరాలకు పైగా భూమి ఉన్న భూస్వామ్య కుటుంబం. ఆమె తోబుట్టువులు తెలంగాణ సాయుధ పోరాట యోధులు భీంరెడ్డి నర్సింహరెడ్డి, భీంరెడ్డి కుశలవరెడ్డి, మరో సోధరి శశిరేఖ ఉన్నారు. తన అన్నతో పాటుగా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిన ఆమె నాడు ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. స్త్రీలు గడపదాటడమే పాపంగా ఉన్న నాటి రోజుల్లో ఊరురా తిరిగి పాటలు పాడుతూ ఉపన్యాసాలు ఇస్తూ ప్రజల్లో చైతన్యం రగిలించింది.
వివాహం..
సాయుధ పోరాటం విరమణ తర్వాత స్వరాజ్యం వివాహం జరిగింది. తన సహచరుడు మల్లు వెంకట నర్సింహారెడ్డితో 1954 మే నెలలో హైదరాబాద్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని దేవులపల్లి వెంకటేశ్వరరావు నివాసంలో నిరాడంబరంగా జరిగింది. బద్దం ఎల్లారెడ్డి, చండ్ర రాజేశ్వర్‌రావు, దేవులపల్లి వెంకటేశ్వర్‌రావు పెండ్లి పెద్దలుగా ఉన్నారు. ఎటువంటి ఆర్బాటాలు లేకుండా దండలు మార్చుకున్నారు. రాజకీయంగా మల్లు వెంకట నర్సింహారెడ్డి, స్వరాజ్యం తోడునీడగా ముందుకు సాగారు.
రాజకీయ ప్రస్థానం..
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం సాయుధ రైతాంగ పోరాటం ముగిసిన తర్వాత ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి ప్రవేశించారు. రెండుసార్లు తుంగతుర్తి నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978, 1983లో విజయం సాధించారు. 1985 ఓటమి చెందారు. రాష్ట్ర మహిళా సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో స్త్రీల సమస్యలను, వారిపై జరుగుతున్న లైంగికదాడులను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ఆమె ఎంతగానో కృషిచేశారు. సమాన పనికి సమాన వేతనం లభించడానికి ఆమె చేసిన పోరాటం గొప్పది. ఒకవైపు నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తూనే బీడు భూములపై రెవెన్యూ డివిజనల్ అధికారి దృష్టికి తీసుకెళ్లి భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేసేలా కృషి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను చైతన్యం చేయడంకోసం అమోఘమైన పోరాటం చేశారు.
సంతానం..
మల్లు స్వరాజ్యం- వెంకట నర్సింహారెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వారిలో ఒకరు డా|| మల్లు గౌతమ్‌రెడ్డి మిర్యాలగూడలో వైద్య వృత్తిలో ఉన్నారు. మరొకరు మల్లు నాగార్జున రెడ్డి సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కూతురు పాదూరి కరుణ 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా పోటీచేశారు. కోడలు మల్లు లక్ష్మి ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
పోరాటమే ఊపిరిగా ..
1945-48 సంవత్సరాల్లో గెరిల్లా దళాలతో వీరోచిత సాయుధ పోరాటంలో క్రీయాశీలక పాత్ర పోషించి, నైజాం సర్కార్‌ను గడగడలాడించిన ధీరవనిత. తిరుగులేని శక్తియై ముచ్చెమటలు పట్టించింది. రజాకార్ల ఆగడాలను ఎదుర్కొంటూ సింహనాదమై వణికిస్తూ ధీశాలిగా నిలిచారు. ఇదే క్రమంలో కొంత కాలం ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆమె పోరాటాలను తట్టుకోలేక 1947-48లో సొంత ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. ఆమెను పట్టుకున్న వారికి బహుమతి ఇస్తామని కూడా నాటి ప్రభుత్వం ప్రకటించింది. సాయుధ పోరాటంలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పనిచేశారు. నాడు దొరల దురహంకారాన్ని పాటల ద్వారా ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తూ చైతన్యపరిచారు. మహిళా దళకమాండర్‌గా పనిచేశారు.
11 ఏండ్లకే ఆంధ్ర మహాసభలో చేరిక
ఎనిమిదేండ్ల వయస్సులో స్వరాజ్యం తండ్రి మరణించారు. అయినా తనలో ఉన్న భావాలను పదిమందికి పంచడానికి సిద్ధమయ్యారు. దానికోసం అవసరమైన విద్యను నేర్చుకున్నారు. రచయిత గోర్కి రాసిన ''అమ్మ'' నవల ఆమెపై చెరగని ముద్ర వేసింది. మూడోతరగతి వరకు చదువుకున్న ఆమె నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి ఆంధ్ర మహాసభలో తన సోదరుడు భీంరెడ్డి నర్సింహారెడ్డి, సోదరి శశిరేఖతో కలిసి పనిచేశారు. మహాసభ పిలుపు మేరకు తన పొలంలో పండిన వరి ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టారు. ప్రజా ఉద్యమాల్లో చేరడానికి ఆమె సోదరుడు భీంరెడ్డి నర్సింహారెడ్డి(బిఎన్) స్ఫూర్తినిచ్చారని చాలాసార్లు చెప్పుకొచ్చారు. 40వ దశకంలో యువత ఆశయాలకు ప్రతిరూపంగా కమ్యూనిస్టు ఉద్యమం దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న సమయంలో ఆమె, ఆమె సోదరులు కమ్యూనిస్టు పార్టీలో సభ్యులుగా చేరారు.
పత్రిక రంగంలో కూడా..
చిన్నతనం నుంచే ప్రజల కష్టాలు పసిగట్టి, దొరల కబంధ హస్తాల నుంచి పేదలను విముక్తి చేయడానికి బందూకు పట్టిన స్వరాజ్యం.. స్త్రీల సమస్యలను కూడా ప్రపంచానికి తెలియడానికి పత్రిక రంగంలో కూడా కృషి చేశారు. వామపక్ష భావజాలంతో స్త్రీల ఆధ్వర్యంలో మొదలైన పత్రిక ''చైతన్య మానవి'' సంపాదక వర్గంలో ఒకరుగా ఉంటూ తన సేవల్ని అందించారు.










