Feb 18,2023 20:39

స్వప్నమే


జిల్లాలో సెయిల్‌ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు డిమాండ్‌ నిత్యనూతనత్వాన్ని సంతరించుకోనుంది. కేంద్రంలోని బిజెపి సర్కారు ఫీజుబులిటీ పేరుతో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడానికి దగా చేయడం విశ్వాసఘాతుకం. ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడంలో కీలకమైన ముడిఖనిజాల్లో ముడి ఇనుప ఖనిజం, డోలమైట్‌ వంటి మూలకాలు జిల్లా, రాష్ట్ర సరిహద్దుల్లో పెద్దమొత్తంలో పోగుపడిన సంగతి తెలిసిందే. లాభాల సాధనలో కీలకమైన వనరులు అందుబాటులో ఉండి, ప్రపంచంలో రియల్‌ఎస్టేట్‌ రంగం మొదలుకుని నిర్మాణ పనుల కార్యకలాపాలు విస్తరించిన నేపథ్యంలో ఉక్కు డిమాండ్‌ ఏర్పడింది. ఇటువంటి సమయంలో మరిన్ని ఉక్కు పరిశ్రమలను ఏర్పాటు చేయడం ఎంతో కీలకమని సర్వేలు చెబుతుండగా, బిజెపి సర్కారు ఫీజుబులిటీ పేరుతో దోబూచులాడడంలోని మతలబే మిటో తెలియడం లేదు. రాయలసీమ పట్ల ఎంతో ప్రేమను ఒలకబోసి రాయలసీమ డిక్లేషన్‌ ఆవిష్కరించిన నాయకు లేమయ్యారో తెలియడం లేదు. జాతి భవిష్యత్‌కు సంబంధించిన కీలక అంశాల పట్ల రాజకీయాలు చేయడం విస్మయాన్ని కలిగిస్తోంది. కేంద్ర సర్కారు ఫీజులిటీ అంశాన్నే తీసుకుంటే, ప్రయివేటు పరిశ్రమాధి పతులకులేని ఫీజుబిలిటీ ప్రభుత్వ సంస్థల ఏర్పాటులో ఎందుకు అవసరం ఏర్పడిందో సమాధానం చెప్పాల్సి. రాష్ట్ర విభజనకు ముందే 2009లోనే బ్రహ్మణీ పేరుతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన 40 శాతం పనుల్ని పూర్తి చేసినప్పుడు, ప్రభుత్వ రంగంలో ఉక్కు పరిశ్రమను ఎందుకు ఏర్పాటు చేయరో ప్రశ్నించాలి. సెయిల్‌ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటుతో సామాజిక న్యాయం సంతరించుకునేదని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ప్రయివేటు రంగంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడం వల్ల సామాజిక అంత రాలను మరింత పెంచడానికే తోడ్పడుతుందని ప్రత్యేకంగా చెప్పన వసరం లేదు. ఫీజుబిలిటీ లేనిచోట ప్రయివేటు రంగంలో పరిశ్రమ ఏర్పాటుకు ఎందుకు అనుమతి ఇచ్చిందో చెప్పాలి. బ్రహ్మణీ దగ్గర నుంచి జిఎస్‌డబ్య్లు పరిశ్రమాధితులు లాభం లేనిచోట పరిశ్రమ కాదు ఒక్క పైసాను కూడా పెట్టుబడిగా పెట్టడానికి ముందుకు రారనే సంగతి జగమెరిగిన సత్యం. ఇటువంటి ఫీజుబులిటీ లేని ప్రాంతంలో ప్రయివేటు రంగానికి వచ్చే లాభాలు, సెయిల్‌ ఆధ్వ ర్యంలోని ప్రభుత్వరంగ ఉక్కు పరిశ్రమ వంటి సంస్థల ఎందుకు లాభాలు రావో ఆలోచించుకోవాలి. దీన్నిబట్టి మనకు బోధపడే దేమిటి? కేంద్రంలోని బిజెపి సర్కారు యొక్క విధానం ప్రయివేటు, కార్పొరేట్‌ సంస్థలకు ఉదారంగా దోచి పెట్టడమనేది బహిరంగ రహస్యం. అందుకే సెయిల్‌ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడం లేదనేది నిర్వివాదాంశం. దేశం లోని 30 రాష్ట్రాలు, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యంత వెనకబడిన ప్రాంతమని శ్రీకృష్ణ కమిషన్‌, శివరామృష్ణన్‌ కమిటీలు సహా ఇతర సంఘాలు నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఇటువంటి వెనుక బడిన ప్రాంతాల్లో శాశ్వత అభివృద్ధి ప్రణాళికల్ని అమలు చేయకుండా, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దుర్మార్గం. ఇటువంటి పాలకుల విధానాల కారణంగా దేశంలోని 40 శాతం ప్రజల సంపద ఒక్క శాతం కార్పొరేట్ల దగ్గర, మూడు శాతం మంది కార్పొరేట్ల దగ్గర 55 శాతం ప్రజల ఆదాయం పోగుపడిందని మొత్తుకుంటున్నప్పటికీ పట్టడం లేదు. కదలని చలనం లేని పాలకుల నిష్క్రియాపరత్వం కారణంగా సామాజిక అసమానతలు పెచ్చరిల్లతుండడం విషాదకరం. మహారాష్ట్రలోని ముంబై, కర్నాటకలోని విజయనగర, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఉక్కు పరిశ్రమల తరహాలో కడప జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఉక్కు పరిశ్రమకు కీలకమైన ముడిసరుకు కడప, అనంతపురం, పూర్వ ఎపి ప్రాంతమైన బళ్లారిలో ఐరన్‌ఓర్‌ గనులు, డోలమైట్‌ వంటి ముడిఖనిజాలు ఉన్న నేపథ్యంలో ఎందుకు ఏర్పాటు చేయడం లేదో ప్రజలే ఆలోచించుకోవాలి. లాభాల్లో నడుస్తున్న ఎల్‌ఐసి, రైల్వేలు వంటి నవరత్న కంపెనీలను ప్రయివేటు మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ రూపంలో తెగనమ్ముతోంది. ఇటువంటి కేంద్ర పాలకులు ప్రభుత్వ రంగంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తారనుకోవడం ఎండమావుల్లో నీటిని వెతకడం లాంటిదే కదా ఆలోచించండి.
- ప్రజాశక్తి - కడపప్రతినిధి