Jul 13,2021 07:56

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో స్వేచ్ఛాయుత, బహిరంగ ఇంటర్నెట్‌ దాడికి గురవుతుందని గూగుల్‌ అధినేత సుందర్‌ పిచారు తెలిపారు. భారతదేశంలో నూతన ఐటి నిబంధనలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బిబిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అనేక దేశాలు సమాచార ప్రవాహానికి అడ్డంకులు సృష్టించడానికి కఠినమైన పద్ధతులను అవలంబిస్తున్నాయని చెప్పారు. బలమైన ప్రజాస్వామ్య సంప్రదాయాలు, విలువలు కలిగిన దేశాలు ఇంటర్నెట్‌ విచ్ఛిన్నతకు వ్యతిరేకంగా నిలబడాలని కోరారు. గత మే నెలలో, పిచారు ఆసియా పసిఫిక్‌ ప్రాంతం నుంచి మీడియాతో మాట్లాడుతూ ''గూగుల్‌ స్థానిక చట్టాలను పాటించటానికి కట్టుబడి ఉందని, ప్రభుత్వాలతో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుందని చెప్పారు. స్వేచ్ఛాయుత, బహిరంగ ఇంటర్నెట్‌ విలువలు, దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా స్పష్టంగా తమకు తెలుసునని, అందుకోసం తాము కట్టుబడి ఉంటామని తెలిపారు.