Dec 18,2022 21:43

గాంధీసర్కిల్లో ప్రతిజ్ఞ చేస్తున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కమిషనర్‌, వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు

ధర్మవరం టౌన్‌ : ధర్మవరాన్ని స్వచ్ఛ ధర్మవరంగా తీర్చిదిద్దుదామని మున్సిపల్‌ కమిషనర్‌ రమణారెడ్డి పేర్కొన్నారు. క్లాప్‌ క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ లింగంనిర్మల, కమిషనర్‌ రమణారెడ్డి ఆధ్వర్యంలో వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది పట్టణంలో ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఇంటిలోని తడి, పొడి చెత్తను రోడ్డుపైకి పారవేయకుండా మున్సిపాలిటీ వారు అందించిన చెత్తబుట్టలలో వేరువేరుగా వేసి తరువాత మీ ఇళ్ల వద్దకు వచ్చే మున్సి పాలిటీ ఆటోలలో వేయాలన్నారు. ఇంటింటి నుంచి చెత్త సేకరణ వందశాతం జరగాలన్నారు. చెత్త సేకరణపై సచివాలయ, మెప్మా సిబ్బంది ద్వారా ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. డిసెంబరు 31వతేదీ నుంచి ప్లాస్టిక్‌ నిషేధం అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్లు భాగ్యలక్ష్మి, పెనుజూరు నాగరాజు, కౌన్సిలర్లు, మున్సిపల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.