ప్రజాశక్తి - విజయవాడ అర్బన్
దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో పోరాట పటిమను చూపిన ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు నడకతో విజయవాడ నగరం పునీతమైందని సరయోధులను స్మరించుకునేలా ఆజాదీకా అమృత్ మహౌత్సవ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు. మంగళవారం బెంజిసర్కిల్ వద్ద గల వాసవ్య మహిళా మండలి భవన్‌లోని గోరా సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధురాలు రావూరి మనోరమ సత్కార కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డిల్లీరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా రావూరి మనోరమను సత్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దేశం కోసం అలుపు ఎరుగని పోరాటం చేసిన ఎంతో మంది సమరయోధులు కాలిడిన పుణ్యభూమి విజయవాడ నగరం అన్నారు. మహాత్మాగాంధీ స్పూర్తితో గోరా దంపతులు స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించారన్నారు. కుటుంబ సభ్యులకు పెట్టిన పేర్లు వారి ఉద్యమ స్పూర్తికి నిదర్శనమని తెలిపారు. తొలుత మహాత్మాగాంధీ కాంస్య విగ్రహానికి, సరస్వతీగోరా విగ్రహాలకు నూలు దండ వేసి నివాళులు అర్పించి రాట్నం వడికి సర్వస్వతి గోరా మందిరంలో స్వాతంత్య్ర సమర ఘట్టాలపై ఏర్పాటుచేసిన ఫోటోలను తిలకించారు. డాక్టర్ సమరం, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.










