Jan 27,2023 21:05

మాట్లాడుతున్న ఎస్‌వియు రిటైర్డ్‌ ఆచార్యులు రవికుమార్‌

ఎస్‌వియు రిటైర్డ్‌ ఆచార్యులు మేడిపల్లి రవికుమార్‌
ప్రజాశక్తి-పీలేరు : సుదీర్ఘకాలం సాగిన భారత స్వాతంత్య్రోద్యమానికి దశదిశ నిర్దేశించి ఉద్యమకారులను ఏకీకరణ చేసింది ఆనాటి పత్రికలేనని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ విశ్రాంత ఆచార్యులు మేడిపల్లి రవికుమార్‌ తెలిపారని. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ రీసెర్చ్‌ (ఐసిఎస్‌ఎస్‌ఆర్‌) సౌజన్యంతో పీలేరు సంజరు గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం 'భారత స్వాతంత్రోద్యమంలో తెలుగు పత్రికలు, జర్నలిజం పాత్ర' అనే అంశంపై ప్రారంభమైన రెండు రోజుల జాతీయ సదస్సులో ఆయన కీలక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు దేశంలోని విభిన్న ప్రాంతాల్లో, విభిన్న రూపాల్లో జరుగుతున్న స్వాతంత్ర పోరాటానికి జాతీయోద్యమ రూపులిచ్చి ఉద్యమ లక్ష్యం పక్కదారి పట్టకుండా దిశా నిర్దేశం చేసింది పత్రికలేనన్నారు. పురాణాలు, ఇతిహాసాల వల్ల సాధ్యం కాని జాతి ఏకీకరణ పత్రికల ద్వారానే సాధ్యమైందని, కేవలం స్వాతంత్ర సాధన ఏకైక లక్ష్యంతో, స్వాతంత్ర ఉద్యమ ప్రచారానికి ఆవిర్భవించిన అనేక పత్రికల ద్వారా స్వాతంత్ర సాధన కాసింత సులభమైందన్నారు. సాంకేతికత ఏమాత్రం లేని ఆ రోజుల్లో పత్రికలు లేకుంటే స్వాతంత్య్ర సాధన మరికొన్ని దశాబ్దాల పాటు ఆలస్యమయ్యేదని అభిప్రాయ పడ్డారు. దేశం కోసం ఆవిర్భవించిన పత్రికల్లో పనిచేసిన జర్నలిస్టులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బ్రిటిష్‌ వారి నిర్బంధాల మధ్య ఉద్యమ గమనాన్ని, స్థితిగతులను ప్రజలకు నిర్భయంగా తెలియజేశారన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఆంగ్ల శాఖాధ్యక్షులు ఆచార్య పెద్ది హరిపద్మారాణి మాట్లాడుతూ కేవలం దేశభక్తిని ప్రచారం చేయడం కోసమే ఆనాడు అనేక పత్రికలు ఆవిర్భవించాయని తెలిపారు. కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జింక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేశ ప్రజలను, కుటుంబ సభ్యుల మార్చి స్వాతంత్య్ర ఉద్యమంలో భాగస్వాములను చేసిన ఘనత ఆనాటి పత్రికలదన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ సహాయాచార్యులు డాక్టర్‌ రఘు మాట్లాడుతూ గతంలో దేశ ప్రయోజనాలే పరమావధిగా పనిచేసిన పత్రికలు ప్రస్తుతం తాము అవలంబిస్తున్న ధోరణిపై తులనాత్మక సమీక్ష చేసుకోవాలని సూచించారు. విశ్రాంత అధ్యాపకులు డాక్టర్‌ సమరం రామచంద్రారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ సమయంలోని తెలుగు పత్రికల ద్వారా దేశానికి ఎన్‌జి రంగ, తెన్నేటి విశ్వనాథం, బెజవాడ గోపాల్‌రెడ్డి వంటి మహోన్నత నాయకులు దొరికారన్నారు. సదస్సు సమన్వయకర్త పీలేరు డిగ్రీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు కరణం శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ మానవ జీవన పరిణామ క్రమాన్ని సభ్య దిశలో నడిపి ఆలోచనల మధనానికి వేదికగా నిలిచి అనేక సామాజిక, శాస్త్రీయ ఆవిష్కరణలకు పత్రికలు వేదికలుగా నిలిచాయన్నారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సదస్సుకు హాజరైన అధ్యాపకులు, విద్యార్థులు సమర్పించిన పత్రాలతో ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎపిజిసిజిడిఎ అధ్యక్షులు నరసింహులు, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సుధాకర్‌రెడ్డి, వైస్‌ ప్రిన్సిపల్‌ శివరామిరెడ్డి, అధ్యాపకులు రమేష్‌ చంద్రబాబు, వెంకటరత్నం, కవిత, రజని, వెంకట రమణయ్య, సంధ్య, నారాయణస్వామి, సైఫుల్లా, కిషోర్‌ కుమార్‌రెడ్డి, తిరుపాల్‌రెడ్డి, ఎర్రయ్య, రామచంద్ర, రాంబాబు, సుధాకర్‌రెడ్డి, రామకృష్ణ, భరణినాథరెడ్డి, హరిప్రసాద్‌ పాల్గొన్నారు.