ప్రజాశక్తి-విజయవాడ: అజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా అధికారులు ఉద్యోగులు ఖద్దరు దుస్తులు ధరించాలని , మొబైల్స్‌లో వాట్సాప్ ప్రొఫైల్ పిక్‌గా జాతీయ పతాకాన్ని ఉంచి ప్రజలలో స్వాతంత్య్ర స్పూర్తిని నింపాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు. హర్‌ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహణపై సోమవారం కలెక్టరేట్ స్పందన సమావేశం మందిరంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. 2న పింగళి వెంకయ్య, బళ్లారి రాఘవల జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందన్నారు. జాతీయ పతాక రూపకర్త కృష్ణాజిల్లాకు చెందిన వారు కావడంతో పాటు ఎన్‌టిఆర్ జిల్లాలోని విజయవాడ నగరంలో జాతీయ పతాకానికి పునాది వేయడం అందరికి గర్వకారణమన్నారు. 3న కాకాని వెంకటరత్నం జయంతి ఉత్సవాలను, 4న పాఠశాల, కళాశాల, యూనివర్సిటిల విద్యార్థులకు గేయ పోటీలను నిర్వహించాలన్నారు. అనంతరం ఖద్దరు దుస్తులు ధరించిన అధికారులతో కలెక్టర్ ఫొటోలు దిగారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నుపూర్ అజరు, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్, డ్వామా పిడి జె.సునీత, ఐసిడిసి పిడి జి.ఉమాదేవి, డిఇవో సి.వి.రేణుక, డిఎస్‌వో కోమలి పద్మ, ఎస్సీ వెల్ఫెర్ డిప్యూటి డైరెక్టర్ విజయభారతి ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆజాదీకా అమత్ మహోత్సవ్ పోస్టర్ ఆవిష్కరణ
ఆజాదీ కా అమత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఈ నెల 1 నుంచి 15 వరకు నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్‌ను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాస రచన పోటీలు, పెయింటింగ్, జింగల్స్, మోనో ఆక్షన్, పేట్రియాటిక్ డ్రామా / పాటలు, వాల్ పెయింటింగ్ తిరంగా సేల్ఫీ వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్చందంగా పాల్గొని ఆజాదీ కా అమత్ మహోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.










