ప్రజాశక్తి-విజయవాడ
75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంను సుందరంగా తీర్చిదిద్ది వేడుకలకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు బుధవారం స్టేడియంలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీన 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ఇంధిరాగాంధీ స్టేడియంలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో పాటు రాష్ట్ర మంత్రులు ఉన్నతాధికారులు వేడుకలలో పాల్గొంటారన్నారు. పోలీస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు అవసరమైన బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల విజయవంతంలో భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ డిల్లీరావు అన్నారు. సమావేశంలో శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్, శాసన మండలి సభ్యులు తలశిల రఘురామ్, జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజరు, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










