రాయచోటి టౌన్ : పుచ్చలపల్లి సుందరయ్య సత్యాన్ని మాత్రమే నమ్మి, మాట్లాడేవారని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు షేక్ ఫయాజ్ అన్నారు. సిపిఎం కార్యాలయంలో శుక్రవారం పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పుచ్చలపల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుందరయ్య ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఉండే వారని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఎంతటి వారినైనా నిలదీసి అడి గేవారన్నారు. ఎంపీగా ఉన్నా సైకిలు పై సభకు వెళ్లే నిరాడంబరం వ్యక్తి పుచ్చలపల్లి అన్నారు. సర్వస్వం పార్టీకే అంకితం చేసిన త్యాగశీలి అన్నారు. తన వాటాకు వచ్చిన యావదాస్తిని ప్రజా ఉద్యమాలకు ఖర్చుచేశారన్నారు. అనేక విలువైన పుస్తకాలను రాశారన్నారు. 1985 మే 19న మరణించే వరకు ఆయన ప్రజల కోసం అహర్నిశలు శ్రమించారన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్ర, ఉపాధ్యక్షులు నాగబసిరెడ్డి, సిఐటియు నాయకులు నాగేష్ గౌడ్, కెవిపిఎస్ జిల్లా కన్వీనర్ డి.సి వెంకటయ్య, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తులసిరాం, పట్టణ ఉపాధ్యక్షులు రమణమ్మ, ఐద్వా మహిళా సంఘం రామక్క పాల్గొన్నారు. మదనపల్లె అర్బన్ : పీడిత ప్రజల కోసం అహర్నిశలూ పాటుపడి జీవితాన్ని త్యాగంచేసిన మహామనీషి సుందరయ్య అని సిపిఎం పట్టణ కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు హరిశర్మ, టి.హరేంద్రనాధ్‌శర్మ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన వర్ధంతి సందర్భంగా మదనపల్లి సిపిఎం ఆఫీసులో సుందరయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నతనం నుంచే దోపిడీని ఎదురించడం నేర్చుకున్నారని చెప్పారు. చిన్నతనంలోనే దళితుల పట్ల ఉన్న వివక్షను ఎదిరించి ఆదర్శప్రాయుడైనారని, వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించి మార్గదర్శకుడైనారన్నారు. యువకులు, మహిళలు, విద్యార్థులు, కార్మికులు, కర్షకుల సమస్యలపై ఏకం చేసి పోరాటబాట నేర్పి మహానాయకుడైనారన్నారు. సమావేశంలో సిపిఎం నాయకులు ఎన్. చంద్ర, వెంకటేష్, నాగరాజు, సురేంద్ర, జయరాం, గౌరి,గంగ సుందరయ్యకు శ్రద్ధాంజలి ఘటించారు.










