- వసతులు పరిశీలిస్తున్న కమిషనర్
శుభ కార్యాల నిర్వహణకు షాదీ మంజిల్ సంసిద్ధం
నెల్లూరు:నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన షాదీ మంజిల్ లో అన్ని వసతులను కల్పించి శుభకార్యాల నిర్వహణలకు సంసిద్ధం చేశామని కమిషనర్ హరిత వెల్లడించారు. స్థానిక 43 వ డివిజన్ కోటమిట్టలో అధునాతన స్థాయిలో నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న షాదీమంజిల్ ను కమిషనర్ బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జీం2 భవన నిర్మాణంలో భాగంగా రూపొందించిన రెండు వివాహ వేదికలు, వంటశాల, భోజనశాల, వధూవరుల ప్రత్యేక గదులు, సరుకుల నిల్వ గది, లిఫ్టు సౌకర్యం, విద్యుత్ సరఫరా, వెంటిలేషన్, మరుగుదొడ్లను పరిశీలించారు. ప్రాంగణంలోని సిమెంట్ తదితర వేస్ట్ మెటీరియల్ అంతా శుభ్రం చేయాలని, అదేవిధంగా షాదీమంజిల్ అన్ని అంతస్థులలో అగ్నిప్రమాద నిరోధకాలను సైతం వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 5వ తేదీన మొదటి శుభకార్యాన్ని నూతన షాదీ మంజిల్ లో నిర్వహించనున్నామని కమిషనర్ తెలిపారు. అధునాతన వసతులతో షాదీ మంజిల్ లో శుభకార్యాలు జరుపుకునే వారికి ఆతిధ్యం కల్పించనున్నామని కమిషనర్ చెప్పారు. నగరపాలక సంస్థ శానిటేషన్, సచివాలయ అమెనిటీస్ విభాగాల సిబ్బందితో పాటు పబ్లిక్ హెల్త్ విభాగం ఆధ్వర్యంలో నూతన షాదీ మంజిల్ పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ సంపత్ కుమార్, డి.ఈ చంద్రయ్య, డి.ఈ.ఈ. అనిల్, డి.ఈ.ఈ. నాగేంద్ర, ఎ.ఈ. మాధవి, పబ్లిక్ హెల్త్ ఈ.ఈ అలీ, సచివాలయ శానిటేషన్, అమెనిటీస్ కార్యదర్శులు పాల్గొన్నారు










