ప్రజాశక్తి-ధర్మవరం టౌన్ :సత్యసాయి నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిఐటియు రాష్ట్ర నాయకులు జి.ఓబులు విమర్శించారు. శనివారం స్థానిక ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో సత్యసాయి వాటర్ సప్లరు పథకం కింద దాదాపు 22 ఏళ్లుగా 572 మంది కార్మికులు 750 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారన్నారు. అలాంటి కార్మికుల సమస్యలను ప్రభుత్వం పెడచెవిన పెట్టి చోద్యం చూడటం బాధాకరమన్నారు. ముఖ్యంగా 5 నెలల బకాయి జీతాలు, పీఎఫ్, ఇఎస్‌ఐ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ పథకాన్ని విభజించి ముక్కలు చేసి అధికార పార్టీ కార్యకర్తలకు ఉపాధిగా అందించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించాలన్నారు. మార్చి నుంచి వేతనాలు పెంచాలని, కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి రెగ్యులరైజ్ చేయాలని, ప్రతినెలా 5వతేదీలోగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
అమరాపురం : మండలంలోని శ్రీరామ్ రెడ్డి రక్షిత తాగునీటి పథకం స్కీం వర్కర్లు శనివారం సమ్మెబాట పట్టారు. నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు. కార్మికుల వేతనాలు అందకపోవడంతో సమ్మె బాట పట్టినట్లు కార్మిక సంఘం నాయకులు హనుమంతరాయ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు రెండు నెలల వేతనాలతో పాటు పిఎఫ్ బకాయిలు, ఇఎస్‌ఐ, గ్రాడ్యుటీ తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులపై కక్ష సాధింపు చర్యలు ఆపాలన్నారు. ఈకార్యక్రమంలో శ్రీరామ్ రెడ్డి తాగునీటి పథకం కార్మికులు పాల్గొన్నారు










