విశాఖ : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా.. విశాఖలో కార్మిక, ఉద్యోగ, వామపక్ష, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ అఖిల భారత కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు రెండు రోజుల పాటు దేశ వాప్త బంద్‌కు పిలుపునిచ్చిన వేళలో... విశాఖ నగరంలో బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ జోలికి వస్తే ఊరుకునేది లేదని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. అయితే బంద్ నిర్వహిస్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకొని ఎక్కడిక్కడ అరెస్ట్‌లు చేస్తున్నారు. కార్మికుల పోరాటానికి విశాఖ నగర ప్రజలు కూడా సంఘీభావం తెలిపారు. స్వచ్ఛందంగా షాపులు, దుకాణాలు మూసేశారు.



సోమవారం ఉదయం స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద కార్మిక సంఘ నాయకులు నిరసన తెలిపారు. బంద్‌ను విజయవంతం చేయాలంటూ ప్రజాసంఘాలు భారీ ర్యాలీ చేపట్టాయి. ఈ క్రమంలో మద్దిలపాలెంలో అఖిల కార్మిక కర్షక ఐక్య కార్యాచరణ సమితి నిరసన చేపట్టింది. పలు చోట్ల నిరసనలు, ర్యాలీలు వెల్లువెత్తాయి. బంద్‌లో భాగంగా బైక్ ర్యాలీలు చేపట్టారు.
ప్లాంట్‌ను అమ్మే హక్కు ఎవరికీ లేదు : కార్మికులు
ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ .... స్టీల్ ప్లాంట్‌పై అవగాహన లేకుండా కేంద్రమంత్రులు మాట్లాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ అంతా పోరాటాల చరిత్ర అని గుర్తు చేశారు. ప్లాంట్‌ను అమ్మే హక్కు ఎవరికీ లేదని గళమెత్తారు. వామపక్షనేతలు మాట్లాడుతూ .... ప్రజలను తప్పుదోవ పట్టించేలా పార్లమెంట్ సాక్షిగా అసత్యాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.










