Apr 11,2023 21:09

సర్వజన వైద్యం..సర్వత్రా నిర్లక్ష్యం..


అక్కడ సేవలన్నీ డొల్ల
చికిత్స చేసేది శంకర్‌దాదా ఎంబిబిఎస్‌లే
వార్డుల్లో వైద్యుల పర్యవేక్షణ అంతంత మాత్రమే
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ : గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఉన్న నిరుపేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఆశయం బాగున్నప్పటికీ అమలు చేయడంలో కింది స్థాయి అధికారులు విఫలమవుతున్నారని చెప్పడంలో సందేహం లేదు. ఇందుకు నిదర్శనమే రాజంపేట పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి అని చెప్పడంలో సందేహం లేదు. అది పేరుకే సర్వ జనాసుపత్రి. సేవలందేది కొందరికే. అవును, మీరు వింటున్నది నిజమే. రాజంపేట ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు అందాలంటే రాజకీయ నాయకులు లేదా, ఆసుపత్రిలో సిబ్బంది సిఫార్సు ఉంటే ఒకలా, అవేవీ లేకుంటే మరోలా రోగులకు చికిత్సలు చేస్తున్నారని ఆసుపత్రిని సందర్శించిన ప్రజలు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. 50 నుంచి 100 పడకల ఆసుపత్రిగా నవీకరణ చెందినప్పటికీ రోగులకు సౌకర్యాలు కల్పించడంలోనూ, చికిత్స అందించడంలోనూ, వారిని ఆప్యాయంగా పలకరించడంలోనూ సర్వజనాసుపత్రి పూర్తిగా విఫలమైనట్లు తెలుస్తోంది. రాజంపేట డివిజన్‌ కేంద్రం కావడంతో మండలం నుంచే కాకుండా నందలూరు, పెనగలూరు, చిట్వేలి, రైల్వేకోడూరు నుంచి ప్రతిరోజు వందలాదిమంది రోగులు, అత్యవసర కేసులు వివిధ రకాల వైద్య సేవల కోసం రాజంపేట సర్వజనాసుపత్రిని పెద్దాసుపత్రిగా పిలుచుకుంటూ సందర్శిస్తుంటారు. ఐతే.. పేరుకే పెద్ద ఆసుపత్రి గానీ, ఇక్కడ వ్యవహారమంతా డొల్లే... వార్డుల్లో ఇన్‌ పేషెంట్‌గా చికిత్స పొందుతున్న రోగులను వైద్యులు నిత్యమూ సందర్శించి వారి ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీస్తూ తదనుగుణంగా చికిత్స అందించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మూడు రోజులకు ఒకసారి గానీ వార్డుల్లోని రోగులను వైద్యులు సందర్శించి పరామర్శించడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. రోగులకు అందించే వైద్యం కన్నా వారితో ఆప్యాయంగా మాట్లాడి వారిలో మనో ధైర్యాన్ని నింపడంలోనే సగం జబ్బు తగ్గిపోతుందని అంటుంటారు. కానీ ఇందుకు విరుద్ధంగా ఆసుపత్రిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల నుంచి నర్సులు వరకు రోగులను చులకనగా చూస్తూ, దెప్పి పొడుపుగా మాట్లాడుతూ నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వార్డులను శుభ్రపరిచే సిబ్బంది, నర్సులు రోగులను కసురుకుంటూ చిన్న చూపు చూస్తుండడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాలంటేనే ప్రజలలో ఆత్మ న్యూనత భావం నెలకొంది.
శంకర్‌దాదా ఎంబిబిఎస్‌లే
ఎంత మంది వైద్యులు, నర్సులు ఉన్నప్పటికీ వార్డులను శుభ్రపరిచే సిబ్బందితో రోగులకు చికిత్స అందిస్తున్నారనే విమర్శలు అధికంగా వినిపిస్తున్నాయి. సెలైన్‌ పెట్టడం, ద్రావణం అయిపోగానే మార్చడం, గాయాలను శుభ్రపరచి కట్లుకట్టడంతో పాటు సూది మందు వేయడం మినహాయించి అన్ని పనులు పారిశుధ్య సిబ్బందిచే చేయిస్తున్నారని, వైద్యులు, నర్సులు పారిశుధ్య సిబ్బందిని శంకర్‌దాదా ఎంబిబిఎస్‌లుగా వినియోగించుకుంటున్నారు.
కొరవడిన జిల్లా వైద్యాధికారి పర్యవేక్షణ
జిల్లా వైద్యాధికారి పర్యవేక్షణ కొరవడటం వలనే సర్వజనాసుపత్రిలో వైద్యులు, నర్సులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాకరు. పెద్దాసుపత్రిగా, ధర్మాస్పత్రిగా పేరొందిన సర్వజనాసుపత్రికి పూర్వపు వైభవం రావాలంటే జిల్లా స్థాయి వైద్యాధికారుల పర్యవేక్షణ నిత్యం ఉండాల్సి ఉంది.
చర్యలు తీసుకుంటాం
సర్వజనాసుపత్రిలోని సమస్యలపై చర్యలు తీసుకుంటాం. సమస్యలను సూపరింటెండెంట్‌ దృష్టికి తీసుకెళతాం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
- చెన్నకృష్ణ, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ, రాజంపేట.
- రాజంపేట ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి