May 08,2023 19:30

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

ప్రజాశక్తి - రాయచోటి : జిల్లాలో వచ్చే వారంలోపు ఎన్‌సిడి-సిడి సర్వే 90శాతం పూర్తి చేయాలని కలెక్టర్‌ గిరీష పిఎస్‌ వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి ఎన్‌సిడి-సిడి సర్వే, ఏఎన్‌ఎం ఫీడ్‌ బ్యాక్‌, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌, అనీమియా నివారణ తదితర అంశాలపై వైద్యాధికారులు, ఎంఎల్‌హెచ్‌పిలు , ఎఎన్‌ఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఎన్‌ఎం, ఆశా, వైద్యాధికారి సమన్వయంతో ఎన్‌సిడి - సిడి సర్వే పూర్తి చేయాలన్నారు. ఈ సోమవారానికి సదరు అంశంలో 80 శాతం ప్రగతి సాధించాలని గతవారం సూచించామని, అయితే కోనంపేట, సాకిబండ, శెట్టిగుంట, టి. సుండుపల్లె, వీరబల్లి తదితర కొన్ని పిహెచ్‌సిలు సర్వే ప్రగతిలో ఇంకా వెనుకబడి ఉన్నాయన్నారు. ఇందుకు కారణాలను సంబంధిత పిహెచ్‌సి వైద్యాధికారి, ఆశా, ఎంఎల్‌హెచ్‌పిలు, ఎఎన్‌ఎంలను అడిగి తెలుసుకుని వచ్చే వారంలోగా లక్ష్యం మేరకు ప్రగతి సాధించాలన్నారు. సర్వే చేయడం, ప్రగతి సాధనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జీవనశైలిలో మారుతున్న ఆహార అలవాట్లతో వయస్సు నిండకుండానే జబ్బులు చుట్టుముడుతున్నాయని, వ్యాధి ముదిరిపోయే వరకు గుర్తించకపోవడంతో ప్రాణాంతకంగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అసాంక్రమిక వ్యాధుల (ఎన్‌సిడి) కట్టడిలో భాగంగా సార్వత్రిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. మధుమేహం, రక్తపోటు, బాడీ మాస్‌ ఇండెక్స్‌(బిఎంఐ) సహా పలు రకాల సస్పెక్టెడ్‌ కేసులను, స్క్రీనింగ్‌ పరీక్షలను ఎఎన్‌ఎంలు ఇంటింటికి తిరిగి త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆశా, ఎఎన్‌ఎంలు ప్రజలను సచివాలయానికి తీసుకొని వచ్చి ి సర్వే పూర్తిచేయాలని, ఈ కార్యక్రమాన్ని వైద్యాధికారులు స్వయంగా పర్యవేక్షించాలని తెలిపారు. వైద్యాధికారులు, ఎంఎల్‌హెచ్‌పిలు, ఆశా, ఎఎన్‌ఎం ఎన్‌సిడి స్క్రీనింగ్‌తో పాటు ప్రజలకు డిజిటల్‌ ఆరోగ్య ఐడీని కూడా ఆరోగ్య కార్యకర్తలు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ సూచించారు. అదేవిధంగా హెల్త్‌ ఐడి జనరేట్‌ చేయడంలో ప్రతివారం ప్రగతి సాధించేలా చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్‌ఒను కలెక్టర్‌ ఆదేశించారు. జీరో నుంచి ఆరు సంవత్సరాల పిల్లల వివరాలను కూడా నమోదు చేయాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ లో రక్తపోటు, మధుమేహం, సస్పెక్టెడ్‌ కేసులను గుర్తించి పరీక్షలు చేయాలన్నారు. వైద్యాధికారులు తరచూ హెల్త్‌ క్లినిక్‌ లను సందర్శించి ప్రభుత్వం నిర్దేశించిన మేరకు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలను పూర్తి చేయాలన్నారు. గతంలో గుర్తించి ఇప్పటికీ పరీక్షలు పెండింగ్‌లో ఉన్న రక్తపోటు, మధుమేహం, సస్పెక్టెడ్‌ కేసులకు వెంటనే పరీక్షలు పూర్తి చేయాలన్నారు. జిల్లాను రక్తహీనత లేని జిల్లాగా మార్చేందుకు కషి చేయాలని పేర్కొన్నారు. గర్భిణులు, పిల్లలకు హిమోగ్లోబిన్‌ పరీక్షలు తప్పనిసరిగా చేయాలన్నారు. ఇచ్చిన లక్ష్యాలను వందశాతం మేర పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా కషి చేయాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ కొండయ్య, వైద్యాధికారులు, ఎంఎల్‌హెచ్‌లు, ఆశా, ఎఎన్‌ఎం పాల్గొన్నారు.