Jan 25,2023 21:29

ఫొటో : మాట్లాడుతున్న మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పొన్నెబోయిన.చెంచలబాబు యాదవ్‌

షరతులతో కూడిన అనుమతి హాస్యాస్పదం
ప్రజాశక్తి-ఉదయగిరి : తెగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా.లోకేష్‌ పాదయాత్రకు పోలీసులు 15 షరతులతో కూడిన అనుమతి మంజూరు చేయటం హాస్యాస్పదమని మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నెబోయిన.చెంచలబాబు యాదవ్‌ అన్నారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ 27వతేదీన యువగళం పేరుతో కుప్పం నుండి ఇచ్ఛాపురం వరకు చేపట్టదలచిన పాదయాత్రకు పోలీసు శాఖ షరతులతో కూడిన అనుమతి ఇవ్వటం ఉద్దేశపూర్వకమేనని, ప్రజలనుండి వస్తున్న అపూర్వ స్పందన చూసి రాష్ట్ర ప్రభుత్వం భయపడి ఆంక్షలు విధించిందని తెలిపారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి పోలీసు శాఖ అనుమతి ఇవ్వలేదా అని ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించిందన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం నియంతృత్వ పోకడలకు కక్ష సాధింపులకు పాల్పడటం ఎంతవరకు సమంజసమన్నారు. సాయంత్రం 5.55నిమిషాలకు పాదయాత్ర ముగించాలని, ప్రతిసారి మైకు అనుమతి తీసుకోవాలని షరతులు పెట్టటం చూస్తుంటే యువగళం పాదయాత్రపై ప్రభుత్వానికి ఓణుకు పుడుతుందని ఎన్ని ఆటంకాలు సృష్టించినా జరిగే పాదయాత్ర ఆగబోదని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో సాగితీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పాదయాత్రకు ఆటంకం కల్పిస్తే ప్రభుత్వం చరిత్ర హీనంగా మిగిలిపోతుందని వెంటనే షరతులు రద్దు చేసి అనుమతులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు చింతనబోయిన బయన్న, మండల నాయకులు పాల్గొన్నారు.