ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ : శ్రీసత్యసాయి తాగునీటి సరఫరా పథకంలో పని చేస్తున్న కార్మికులకు పిఎఫ్, ఇఎస్‌ఐ బకాయిలను తక్షణమే చెల్లించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు డిమాండ్ చేశారు. శుక్రవారం శ్రీసత్యసాయి తాగునీటి పథకం బోర్డు మీటింగ్ నిర్వహించిన నేపథ్యంలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు స్థానిక కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎమ్.గౌతమిని కలిసి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో శ్రీసత్యసాయి వాటర్ సప్లరు స్కీమ్‌లో 572 మంది కార్మికులు 22 సంవత్సరాలుగా పని చేస్తున్నారన్నారు. ఎల్‌టికంపెనీ పనుల నుంచి వైదొలగిన తరువాత కాంట్రాక్టర్లు మారుతూ వస్తున్నారని తెలిపారు. దీంతో పిఎఫ్ కార్మికుల ఖాతాకు చెల్లించాల్సిన పిఎఫ్ బకాయిలు 9 నెలలుగా చెల్లించలేదన్నారు. ఇఎస్‌ఐ 9 నెలల నుంచి కట్టడం లేదన్నారు. దీంతో కార్మికుల కుటుంబీకులు అనారోగ్యానికి గురైతే ఇఎస్‌ఐ క్లీనిక్‌లకు వెళితే అర్హత లేదని చెబుతుండటంతో ఆందోళన చెందుతున్నారని తెలిపారు. 22 సంవత్సరాలుగా కొనసాగుతున్న పిఎఫ్, గ్రాట్యూటీ, ఇఎస్‌ఐ, బోనస్, లీవ్‌ఎన్‌క్యాష్‌మెంట్ సకాలంలో అందించాలన్నారు. 2 నెలల బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని కోరారు. మెయింటెనెన్స్‌కు సంబంధించి 22 సంవత్సరాలుగా పని చేస్తున్న మోటార్లు పాతబడి పోవడం, వాటికి రీప్లేస్ లేకపోవడంతో తాగునీటి సరఫరా పైపులైన్లు బలహీనమయ్యాయని చెప్పారు. కాలిపోయిన మోటార్లను కూడా రోజుల కొద్దీ మరమ్మతులు చేయించలేని దుస్థితి నెలకొందన్నారు. మెయింటేనెన్స్ సరిగ్గా నిర్వహించి సమస్య తలెత్తకుండా చూడాలని కోరారు. 150 గ్రామాలకు 25 రోజులుగా నీరు అందకపోవడానికి కాలిపోయిన మోటార్లను రీపేరీ చేయించకపోవడంతోనే అని అన్నారు. పుట్టపర్తి ఫేజ్-2లో 86 మంది కార్మికులకు 12 నెలల పిఎఫ్ డబ్బులు ఖాతాలో జమ కాలేదన్నారు. కాంట్రాక్టర్ సలాంఖాన్ మాత్రం చెల్లించినట్లు చెబుతున్నారని, పరిశీలించి కార్మికుల ఖాతాల్లో పిఎఫ్ జమ చేయాలని కోరారు. వెంగళమ్మ చెరువు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కెనాల్ పంప్‌హౌస్‌లకు 2 సంవత్సరాలుగా రోడ్డు రిపేరి పేరుతో విద్యుత్ సరఫరా చేయ లేదన్నారు. దీంతో 150 గ్రామాలకు తాగునీరు అందడం లేదన్నారు. విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని కోరారు. స్పందించిన కలెక్టర్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణ, శ్రీసత్యసాయి తాగునీటి పథకం కార్మికుల యూనియన్ నాయకులు ఎన్.తిరుపాలు, లక్ష్మిరెడ్డి, లక్ష్మినారాయణ, నారపరెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.










