Apr 28,2022 07:45

డ్యాం భద్రతకు తక్షణ చర్యలు అవసరం
భారీ వరదను మళ్లించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి
పాండ్యా కమిటీ నివేదిక వెల్లడి
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి : 
శ్రీశైలం డ్యాం భద్రతకు తక్షణ చర్యలు అవసరమని డ్యాం భద్రతపై అధ్యయనం చేసిన పాండ్యా కమిటీ పేర్కొంది. శ్రీశైలం డ్యాం భద్రతపై గతంలోనూ పలు కమిటీలు ఏర్పాటు అయినా వాటి సిఫార్సులు అమలుకు నోచుకోలేదు. 2020 ఫిబ్రవరిలో కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్‌ ఎబి.పాండ్యా నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. 2021లో సిడబ్ల్యుసి శ్రీశైలం వరద ప్రవాహంపై అధ్యయనం చేసి ఒక నివేదిక సమర్పించింది. గత కమిటీల సిఫార్సులు, సిడబ్ల్యుసి నివేదిక తదితర వాటినన్నింటిని పరిగణలోకి తీసుకుని పాండ్యా కమిటీ ఇటీవల తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. స్పిల్‌వే గేట్ల నుండి నీళ్ళు కింద పడి మళ్ళీ పైకి ఎగిరిపడే ప్రాంతం (ఫ్లంజ్‌ పూల్‌)లో ఏర్పడిన భారీ గుంత డ్యాం భద్రతకు ముప్పు అని దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించింది. ఫ్లంజ్‌ పూల్‌ కుడి, ఎడమ గట్లకు నష్టం వాటిల్లకుండా మరమ్మతులు చేపట్టాలని సూచించింది. రివర్స్‌ స్లూయిజ్‌ గేట్లకు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, దానిపై దృష్టి పెట్టాలని, ప్రధాన స్పిల్‌ వే గేట్ల నుండి నీటి లీకేజీ చర్యలు చేపట్టాలని సూచించింది. అంచనాకు మించి వచ్చే వరదను మళ్లించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని, లేకుంటే డ్యాం భద్రతకు ప్రమాదం అధికం అయ్యే అవకాశం ఉందని నివేదికలో పేర్కొంది. కొత్తగా మరో స్పిల్‌ వే నిర్మించడం, డ్యాం ఎత్తు పెంచడం, నీటిని మళ్లించేందుకు కుడి, ఎడమ వైపుల ఏర్పాట్లు చేయడం వంటి సిఫార్సులను నివేదికలో పేర్కొంది. ప్రస్తుత స్పిల్‌ వే సామర్థ్యానికి మించి లేదని తేల్చి చెప్పింది. డ్యాం భద్రత చర్యలు ప్రారంభించే ముందు ప్రాజెక్టు నిర్వహణపై మళ్ళీ అధ్యయనం చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. గతంలోనూ పలు సార్లు పలు కమిటీలు డ్యాం భద్రతకు ప్రమాదం ఉందని నివేదికలు ఇచ్చినా ఆ సిఫార్సుల మేరకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టలేదు. ప్రస్తుతం పాండ్యా కమిటీ ఇచ్చిన నివేదికను బట్టి అయినా చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. డ్యాం భద్రతకు ముప్పు పొంచి ఉందని ఏడాది ముందు నుంచే 'ప్రజాశక్తి' పలు సార్లు కథనాలను ప్రచురించింది.