Oct 01,2022 22:50

ప్రజాశక్తి - వన్‌టౌన్‌
ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆరవ రోజు శనివారం శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ నేపధ్యంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం 10 గంటల తరువాత అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో క్యూలైనులు భక్తులతో నిండి పోయాయి. భవానీలు కూడా అధిక సంఖ్యలో తరలిరావటం కనిపించింది. వినాయకుని గుడి వద్ద నుండి మూడు క్యూ లైనులలో భక్తులు ఇంద్రకీలాద్రి చేరుకోగా, పున్నమిఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులలో విఐసిలు రూ. 500లు టిక్కెట్లు కొనుగోలు చేసి కొండపైకి చేరుకుని శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుని తరించారు. దర్శనం చేసుకున్న భక్తులకు కొండపైన, దిగువున కనకదుర్గానగర్‌లో సుమారు 15 కౌంటర్లు ఏర్పాటుచేసి లడ్డూ ప్రసాదం అందేవిధంగా చర్యలు చేపట్టారు. అలాగే కనకదుర్గానగర్‌ నుంచి మహామండపంకు వెళ్లు మార్గంలో పక్కన ఖాళీ స్థలంలో టెంట్‌ వేసి దుర్గగుడి ఆధ్వర్యంలో భక్తులకు సాంబార్‌ రైస్‌, దద్దోజనం భోజన ప్రసాదంగా అందజేశారు.
నేడు మూలానక్షత్రం -శ్రీ సరస్వతీ దేవిగా దుర్గమ్మ
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏడవ రోజు ఆదివారం శ్రీ అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావటంతో శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తారు. ఈ నేపధ్యంలో ఆదివారం తెల్లవారుజాము 2 గంటల నుండే అమ్మవారి దర్శన భాగ్యం కల్పించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఆదివారం అందరికీ ఉచిత దర్శనమే ఉంటుంది. ఏ ఒక్క టిక్కెట్‌ అమ్మకాలు ఉండవు. సామాన్య భక్తులు ఎవ్వరికీ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. మూలానక్షత్రం రోజు ఆదివారం కావటంతో శ్రీ సరస్వతీ దేవి రూపంలో దుర్గమ్మను దర్శించుకునేందుకు సుమారు 2 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని దేవాలయ అధికారులు అంచనా వేస్తున్నారు.