Oct 01,2022 22:50

ప్రజాశక్తి - వన్‌టౌన్‌
ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవ రాత్రి ఉత్సవాలు ఆరవ రోజు శనివారం శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ నేపధ్యంలో అమ్మవారిని దర్శించుకునేందుకు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సమీర్‌ శర్మ విచ్చేయగా ఆలయ ఇఓ భ్రమరాంబ ఆలయ మర్యాలతో స్వాగతం పలికి వేదపండితుల ఆశీర్వచనం చేశారు. దర్శనానంతరం మహాలక్ష్మీ అలంకారంలో ఉన్న అమ్మవారి చిత్రపటాన్ని సమర్పించారు. ఎన్‌టిఆర్‌్‌ జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు, నగర పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా టాటా, డిఎస్‌పి విశాల్‌ గున్ని తదితరులు ఆదివారం మూలానక్షత్రం కావటంతో దుర్గగుడికి ముఖ్యమంత్రి రానున్న సందర్భంగా ఏర్పాట్లపై పర్యవేక్షించారు. అనంతరం మీడియా పాయింట్‌ నుండి మంత్రి రాంబాబు మాట్లాడుతూ మహాలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవటం ఆనందదా యకమన్నారు.