Jul 14,2021 13:17

శ్రీనగర్‌ : భారత్‌-పాక్‌ అంతర్జాతీయ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్‌ కలకలం సృష్టించింది. జమ్ముకాశ్మీర్‌లోని అర్నియా సెక్టార్‌ వద్ద మంగళవారం రాత్రి సరిహద్దు భద్రతా బలగాలు (బిఎస్‌ఎఫ్‌) ఈ డ్రోన్‌ తిరుగుతుండటాన్ని గుర్తించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కాల్పులు జరపడంతో డ్రోన్‌ వెనక్కు మళ్లిందని బిఎస్‌ఎఫ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. జులై 13 రాత్రి 10 గంటల సమయంలో బిఎస్‌ఎఫ్‌ బలగాలు అర్నియా సెక్టార్‌ వద్ద ఆకాశంలో ఎర్రటి కాంతి గుర్తించాయని, వెంటనే కాల్పులు జరిపినట్లు బిఎస్‌ఎఫ్‌ తెలిపింది. భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించిన ఆ డ్రోన్‌.. సైన్యం అప్రమత్తతతో పాకిస్థాన్‌ వైపు వెనుతిరిగినట్లు తెలిపాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించగా.. అనుమానాస్పద వస్తువేదీ కనిపించలేదని బిఎస్‌ఎఫ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల జమ్ము వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడి జరిగిన విషయం తెలిసిందే.