Jan 06,2023 21:04

వీడియో కాన్ఫిరెన్స్‌లో మాట్లాడుతున్న జిల్లా సెబ్‌ బ్యూరో అధికారి కెవి.రామకృష్ణ

          పుట్టపర్తి రూరల్‌ : నాటుసారా, కర్నాటక మద్యం, ఇసుక అక్రమ రవాణా నియంత్రణలో భాగంగా జిల్లాలోని సరిహద్దుల వద్ద నిఘాను మరింత పెంచాలని జిల్లా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారి కెవి.రామకష్ణ ప్రసాద్‌ సెబ్‌ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం స్థానిక పోలీస్‌ కార్యాలయం నుంచి జిల్లాలోని సెబ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గత సంవత్సరం పనితీరు, ఫలితాలపై సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరాష్ట్ర సరిహద్దులు, జిల్లాలోని వివిధ ఎక్స్‌జ్‌ చెక్‌పోస్టుల వద్ద నిఘాను మరింత పెంచాలని సూచించారు. కర్నాటక మద్యం, నాటుసారా నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో సెబ్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. కేసుల ఛేదింపులో మరింత చొరవ పెరగాల్సి ఉందన్నారు. పాత నేరస్తులు మళ్లీ నేరాలకు ఒడిగడితే కేసులతో పాటు బైండోవర్‌ చేయాలన్నారు. తరుచూ నేరాలకు పాల్పడే వారిపై రౌడీషీట్‌ తెరవడంతో పాటు, కౌన్సెలింగ్‌ ఇవ్వాలన్నారు. ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌.రవికుమార్‌తో పాటు జిల్లాలోని సెబ్‌ సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.