May 24,2023 21:09

కేతు భౌతికాయానికి నివాళులర్పిస్తున్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ

కడప అర్బన్‌ : అభ్యుదయ సాహిత్యం కోసం అవిశ్రాంతంగా కషిచేసిన శ్రామిక జనపక్షపాతి కేతు విశ్వనాధరెడ్డి మరణం పార్టీకి తీరని లోటు సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. బుధవారం స్థానిక సింగపూర్‌ టౌన్‌షిప్‌లోని కేతు విశ్వనాథరెడ్డి పార్థీవదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నారా యణ మాట్లాడుతూ కేతు విశ్వనాథరెడ్డి ఇక లేరంటే నమ్మశక్యంగా లేదన్నారు. తెలుగు లెక్చరర్‌గా పనిచేశారని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పారు. మాజీ ఎంపీ ఎద్దుల ఈశ్వరరెడ్డి, ఎన్‌.శివరామరెడ్డి, జె.వెంకటరామిరెడ్డి లాంటి రాజకీయదు రంధరులతోపాటు. గజ్జెల మల్లారెడ్డి, వైసిపి రెడ్డి లాంటి సాహిత్యవేత్తలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారి పేర్కొన్నారు. పార్టీ యెడల అకుంఠిత గౌరవభావం కలిగి ఉడేవారి చెప్పారు. 'కడప గ్రామాలు నామాలు' పేరుతో పరిశోధన చేశారని తెలిపారు. కథలకు వన్నె తెచ్చారన్నారు. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షునిగా అభ్యుదయ సాహిత్యం కోసం, శ్రామిక జనం కోసం, కరువు పీడిత రాయలసీమ ప్రాంత సమస్యలపై సాహితీ పోరాటం నడిపారన్నారు. సాహి త్యంలో పరిశోధనలు ప్రోత్సహిస్తూ ఎంతోమంది భావి భారత కవులను తీర్చిది ద్దారన్నారు. కేంద్ర సాహిత్య అవార్డు పొందిన మన కేతు విశ్వనాథరెడ్డి మరణం ఇటు సాహితీ లోకానికి కమ్యూనిస్టు పార్టీకి తీరంలోటని వారి మతికి సంతాపాన్ని కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్ర, నగర కార్యదర్శి వెంకటశివ, వేణుగోపాల్‌, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.
'కేతు'కు సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు నివాళి
భారతీయ సాహిత్యంలో తెలుగు కథను ఉన్నత శిఖరానికి చేర్చిన కథకుడు కేతు విశ్వనాథరెడ్డి అని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్‌ అన్నారు. కేతు విశ్వనాథరెడ్డి భౌతికకాయాన్ని దర్శించి పూలమావేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోహన్‌ మాట్లాడుతూ సాహితీ స్రవంతికి ప్రారంభం నుంచి తోడ్పాటునందించారని పేర్కొన్నారు. సాహిత్య ప్రస్థానం మాసపత్రికలో అనేక కథలు, వ్యాసాలు అందించారని చెప్పారు. కథా సాహిత్యంలో ఆయన చిరస్మరణీయమైన కృషి చేశారని తెలిపారు. పరిశోధనుడుగా, పాఠ్యపుస్తక రచయితగా తెలుగుభాష సాహిత్యాలున్నంత వరకు ఆయనను తెలుగుజాతి మరచిపోదన్నారు. ఆయన మరణం పట్ల సంతాపాన్ని, ఆయన కుటుంబానికి సానుభూతిని ప్రకటిస్తున్నామని చెప్పారు. సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.
కేతు విశ్వనాథరెడ్డి మరణం బాధాకరం
కడప: కేతు విశ్వనాధ్‌రెడ్డి మరణష్ట్రం బాధాకరమని యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జా తిరుమలేష్‌ అన్నారు. కేతుకు ఆయన నివాళులర్పించారు. ఆయన మరణం సాహితీ లోకానికి తీరని లోటన్నారు. రాయలసీమ ఓ గొప్ప సాహితీవేత్తను కోల్పోయిందన్నారు.